కోర్టులు కూడా విడాకులు తీసుకోవాలని వచ్చిన భార్యాభర్తలను కలిపేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తాయి తప్ప విడగొట్టాలని అనుకోవు. కానీ వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడూ విడగొట్టాలనే ప్రయత్నిస్తుంటారు.
ఎన్టీఆర్ కుటుంబం నుంచి జూ.ఎన్టీఆర్‌ని, బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరిని, టిడిపి నుంచి జనసేనను, ఇప్పుడు వాటి నుంచి బీజేపీని విడగొట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
కాదంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు అమిత్ షాతో భేటీ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం అనే కుంటి సాకుతో హడావుడిగా ఢిల్లీకి పరిగెట్టాల్సిన అవసరమే లేదు కదా?
ప్రధాని నరేంద్రమోడీని కలిసిన తర్వాత జగన్ మీడియాకు దణ్ణం పెట్టేసి హడావుడిగా కారు ఎక్కేయడం గమనిస్తే లోపల ఏం జరిగిందో ఊహించుకోవచ్చు!
టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు దాదాపు ఖరారు అయ్యిన్నట్లే అని చంద్రబాబు నాయుడు చూచాయగా చెప్పారు. అయితే బీజేపీతో సీట్ల సర్దుబాట్లపై ఇంకా చర్చించాల్సి ఉంది.
బీజేపీ 5-6 ఎంపీ సీట్లు, 10-12 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సీట్లు జనసేనకు కేటాయించవలసి వస్తోంది. కనుక బీజేపీకి అన్ని సీట్లు కేటాయించాలంటే చంద్రబాబు నాయుడు ముందుగా పార్టీ నేతలతో, ముఖ్యంగా ఆశావాహులతో మాట్లాడి ఒప్పించాల్సి ఉంటుంది. కనుక దీనిపై టిడిపి నిర్ణయం కోసమే బీజేపీ ఎదురుచూస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది. అందుకే మూడు పార్టీలు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ పొత్తులు ఖరారయ్యానే సూచిస్తున్నాయి.
ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ, “మేము దేశంలో అతిపెద్ద రాజకీయ కూటమిగా ఎదగాలని భావిస్తున్నాము. ప్రస్తుతం కొన్ని పార్టీలతో పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అవి కొలిక్కి వస్తాయి. కనుక వాటి గురించి ఇప్పుడే మాట్లాడటం ఎందుకు?” అని అన్నారు.
అయితే ఈ ముక్కని పట్టుకొని వైసీపి ఆత్మసాక్షి మరోవిదంగా తిప్పి చెప్పింది. జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొలేక జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీతో పొత్తుల కోసం ప్రాకులాడుతున్నారని, కానీ పొత్తుల గురించి అమిత్ షా చెప్పిన ఈ మాటతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని కనిపెట్టి చెప్పింది.
నిజానికి టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు గురించి వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డే తీవ్ర ఆందోళన చెందుతున్నారని వేరే చెప్పక్కరలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారట!
జగన్ సింహం అని చెప్పుకుంటున్నప్పుడు, తనను చూసి భయపడుతున్న లేళ్ళ గుంపుని చూసి సంతోషించాలే కానీ భయపడ కూడదు కదా?
టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు కుదరదని, కుదరకూడదని వైసీపి చివరి వరకు ఆశ పెట్టుకుని తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తోంది కనుకనే అమిత్ షా ఏదో రెండు ముక్కలు చెపితే పొత్తులు పెటాకులు అయిపోయిన్నట్లే అని సంతోశపడుతున్నట్లుంది. అల్ప సంతోషులను ఎవరు మాత్రం కాదంటారు?




