నేపాల్ రాజకీయ సంక్షోభంలో కొస మెరుపు ఏమిటంటే, ఆందోళనకారులు ఆ దేశ ఆర్ధిక మంత్రిని బట్టలూడదీసి తరిమి తరిమి కొట్టారు. అంతకు ముందు బంగ్లాదేశ్‌లో కూడా సరిగ్గా ఇలాగే జరిగితే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా త్రుటిలో తప్పించుకొని భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే శ్రీలంకలో, ఇంకా వెనక్కు వెళితే పాకిస్తాన్‌లో కూడా ఇలాంటి తిరుగుబాట్లు, ఘటనలే జరిగాయి. వీటన్నిటిలో కామన్ ఏమిటంటే, పాలకుల అవినీతి కారణంగా సామాన్య ప్రజలు నానాటికీ దారిద్ర్యంలో కూరుకుపోతుండటమే.
భారత్‌లో ఎన్నడూ ఇలాంటి తిరుగుబాట్లు జరగలేదు. జరుగవనే నిశ్చితాభిప్రాయంతో ప్రజలున్నారు. ఇది మన రాజకీయ నాయకుల అదృష్టమనే చెప్పాలి. ఒకప్పుడు 5, 10 కోట్లతో సరిపెట్టుకునే పాలకులు ఇప్పుడు ఏకంగా వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజలు పట్టించుకోరు… మహా అయితే ఎన్నికలలో ఓడించి మూల కూర్చోబెడతారు. అంతేగా! కానీ కొట్టేసిన వేలకోట్లతో అవే రాజకీయాలను కంటి చూపుతో శాశించే వెసులుబాటు ఉండనే ఉందిగా!
ఒకవేళ కేసులు నమోదైన రాజకీయ సమీకరణాలు, అవసరాలు, ప్రయోజనాల లాభ నష్టాల లెక్కల కారణంగా అవినీతికి పాల్పడిన ఏ ఒక్క నాయకుడిపై చట్ట పరంగా చర్యలు తీసుకోలేని నిసహాయ పరిస్థితి దేశంలో నెలకొంది. ఒకవేళ ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా అది రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతోంది.
ఒకవేళ శిక్షపడే పరిస్థితే ఉంటే కేసుల విచారణ ఎప్పటికీ పూర్తికాకుండా వాటితో ఎలా ఫుట్ బాల్ ఆడుకోవచ్చో నాయకులు చట్టాలలో లొసుగులను ఔపోసన పట్టేశారు.
ప్రజలు అడగ(లే)రు. ప్రజలకు జవాబు చెప్పుకోనవసరం లేదు. న్యాయ వ్యవస్థలు ఏమీ చేయలేవు. అధికారంలో ఉన్నవారు కూడా ఏమీ పీకలేరు.
మీడియాకి హాట్ మసాలా న్యూస్ మీద ఉన్న ఆసక్తి అవినీతిపరులు… వారి కేసులపై ఉండదు. కనుక ఎవరికీ భయపడక్కర లేదు. ఎంతైనా నొల్లెసుకోవచ్చు…. అని రాజకీయ నాయకుల నిశ్చితాభిప్రాయం.
కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో జరిగిన ఈ అనూహ్య పరిణామాలు చూసిన తర్వాత అయినా మన దేశంలో రాజకీయ నేతలు బుద్దిగా మసులుకుంటే వారికే మంచిది. ఆనక ప్రజలు పరిగెత్తించి కొట్టారని బాధపడి ప్రయోజనం ఉండదు.





