రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటి కంటే లేనప్పుడే ఎక్కువ చురుకుగా ఉండాలి. ఏపీలో జగన్‌కి ఇంకా ఈ ఆకళింపు కలిగిన్నట్లు లేదు కానీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అపుడే దూసుకుపోతోంది.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచే కేటీఆర్, హరీష్ రావులకు డైరెక్షన్స్ ఇస్తుంటే వారిరువురూ శాసనసభ లోపల బయట కూడా దూసుకుపోతూ అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
అయితే ఇంతకాలం తెలంగాణలో సూపర్ యాక్టివ్‌గా ఉండే బీజేపీ హటాత్తుగా సైలంట్ అయిపోయింది. కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణలో బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు బీజేపీ వెనక్కు తగ్గుతోంది!
దీనిని కేసీఆర్ కూడా గుర్తించారో లేదా బీజేపీతో డీల్ సెటిల్ చేసుకుంటున్నారో తెలీదు కానీ బీజేపీ, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం జోలికి అసలు వెళ్ళడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనే పూర్తి ఫోకస్ పెట్టి యుద్దం కొనసాగిస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీకి ఇది పాత అలవాటే కనుక ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ బీజేపీ ఎందుకు సైలంట్ అయిపోయిందనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆరుగురు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి ట్రాన్స్‌ఫర్ ప్రక్రియకు రంగం సిద్దమవుతోంది…. అందుకేనా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ అందుకోసమే అయితే బీజేపీ నిశబ్ధాన్ని అర్దం చేసుకోవచ్చు కానీ కాకపోతే ఈ అనుమానాల వలన బీజేపీ విశ్వసనీయత మళ్ళీ దెబ్బతింటుంది.
తెలంగాణలో బీజేపీ తీరు చూస్తుంటే మూడడుగులు ముందుకి మూడడుగులు వెనక్కి అన్నట్లే అనిపిస్తోంది. ఒక్కసారిగా పుంజుకోవడం మళ్ళీ అంతలోనే చతికిలపడుతుండటం పరిపాటిగా మారింది.
అయితే బీజేపీ ఓ పనికి మాలిన ఫార్ములాని వల్లెవేస్తూ ‘ఆల్ ఈజ్ వెల్’ అని ఆత్మవంచన చేసుకుంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో మొదట ఒక్క ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు సాధించామని, ఈసారి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు తమ బలం పెరిగిందని సమర్ధించుకుంటోంది. అంటే క్రమంగా బలం పుంజుకుంటున్నామని వాదిస్తోంది. కానీ అది తమ నిద్రావస్థని సమర్ధించుకుంటున్నట్లే ఉంది.
తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత తన బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య ఏదో జరుగబోతోందనే సంకేతాలు కనబడుతున్నాయి.
కనుక బిఆర్ఎస్ పార్టీతో డీల్ కుదుర్చుకుంటోంది కనుకనే బీజేపీ నిశబ్ధంగా ఉంటోందా లేదా తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు రావు కనుక ఆయాసపడినా, ఆవేశపడినా ఏ ప్రయోజనం లేదని సైలంట్ అయిపోయిందో?




