ఈ నెల 25న హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అధ్వర్యంలో ఓ భారీ బహిరంగసభ జరుగనుంది. దానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం కేసీఆర్‌లతో బాటు బిజెపియేతర పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను ఈ సభకు ఆహ్వానించారు. ఈ బహిరంగసభ ప్రధానోద్దేశ్యం దేశంలో బిజెపియేతర పార్టీలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి వచ్చే ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా పోరాడటం అని లోక్‌దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా చెప్పారు.
తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా ఇదే కోరుకొంటున్నారు. ఇటువంటి సమైక్య వేదిక కోసం ఎదురుచూస్తున్నారు కనుక ఆయన తప్పక ఈ బహిరంగసభలో పాల్గొనవచ్చు. ఆయన పంజాబ్, హర్యానా, యూపీ తదితర ఉత్తరాది రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో ఇటీవల ప్రగతి భవన్‌లో వరుసగా రెండు రోజులు సమావేశామైన తర్వాత ఈ బహిరంగసభకు చకచకా ఏర్పాట్లు జరుగుతుండటం, దానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించకపోవడం గమనిస్తే ఇది ఆయన సూచన మేరకే ఆయన సహాయ సహకారాలతోనే జరుగబోతున్నట్లు అనుమానం కలుగుతోంది.
ఇక టిడిపి, బిజెపిలు పొత్తులు పెట్టుకొనే ఆలోచనలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కనుక చంద్రబాబు నాయుడు ఈ సభకు హాజరుకాకపోవచ్చు. ఒకవేళ బిజెపితో పొత్తులు పెట్టుకొనే ఆలోచనలేనప్పటికీ చంద్రబాబు నాయుడు ఈ సభకు హాజరుకాకపోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఇటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఈ సభకు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారో లేదో తెలీదు కానీ వైసీపీ ప్రభుత్వం నిధులు, అప్పులు, కేసుల కోసం మోడీ ప్రభుత్వం మీదే ఆధారపడి మనుగడ సాగిస్తోంది కనుక ఒకవేళ జగన్‌కు ఆహ్వానం అందినా ఈ సభలో పాల్గొనే అవకాశం లేదు.



