కేసీఆర్ రాజకీయ వారసుడిగా తెలంగాణ రాజకీయాలలో అడుగు పెట్టిన కేటీఆర్, తండ్రి అధికారంలో, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుని యువతలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తన శాఖ మీద కూడా పట్టు సాధించుకున్నారు.
Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్?
పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా ఎదిగిన కేటీఆర్ తన వాక్ చతురతతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. అలాగే ఐటీ రంగంలో తనకున్న నాలెడ్జ్ తో హైద్రాబాద్ ను మరోస్థాయికి తీసుకు వెళ్లి దేశ రెండవ రాజధాని హైద్రాబాద్ అనేలా తెలంగాణ పేరును హైద్రాబాద్ బ్రాండ్ ను పెంచారు.
అయితే 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ అన్యూహ్యంగా ఓటమిని ఎదుర్కొంది. పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ఎన్నికల ముందు తెలుగు నాట జరిగిన రాజకీయ ఆట కావచ్చు, కారణం ఏదైనా కానీ బిఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమయ్యింది. దీనితో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో స్థిరపడ్డారు.
Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!
ఇక పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్న కేటీఆర్ ప్రభుత్వానికి కుదుట పడడానికి తగిన సమయం ఇచ్చి, ఇక తన పార్టీ తరుపున ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. అటు కేసీఆర్ మేనల్లుడిగా బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు కూడా తన బావ బాధ్యతను తలెకెత్తుకున్నారు.
అలాగే ఇటు జైలు నుండి బైలు మీద వచ్చిన కవిత కూడా ప్రజాక్షేత్రంలోకి రావడనికి సిద్ధంగా ఉన్నారు. దీనితో పార్టీ ముఖ్యనేతలంతా ఒక్కసారిగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కేటీఆర్ దూకుడు, హరీష్ స్పీడ్ తో బిఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ ఊపందుకుంది.
Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్ విశాఖపట్నమే!
ఇన్నాళ్లుగా ఓటమి భారాన్ని మోస్తూ మౌనంగా ఉండిపోయిన పార్టీ శ్రేణులు సైతం ఎలర్ట్ అయ్యారు. రేవంత్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పట్ల ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించడంతో ఇక వాటినే బిఆర్ఎస్ తమ ఆయుధాలుగా మార్చుకుని ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి కేటీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు మొదలుకుని, ప్రభుత్వ విధానాలలో దొరలే చిన్న పాటి పొరపాటులను సైతం సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపుతూ రేవంత్ మీద ఎదురులేని యుద్ధం చేయడానికి నేను సిద్ధం అంటూ పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపుతున్నారు. పార్టీ గెలుపులో తండ్రి పక్కన ఉన్న కేటీఆర్ పార్టీ ఓటమిలో తండ్రి బాధ్యతను భుజానకెత్తుకున్నారు.
కేటీఆర్ ఊపు చూస్తుంటే కేసీఆర్ సాయం లేకుండానే బిఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చి తనను తానూ ఒక స్థిరమైన రాజకీయ నాయకుడిగా, బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్ గా నిరూపించుకోవాలని ఉవ్విర్లురుతున్నట్టు కనిపిస్తున్నారు. అయితే కేటీఆర్ ఆశలకు, ఆకాంక్షలకు ప్రజా తీర్పుతో పాటుగా కేసీఆర్ ఆశీర్వాదం, హరీష్ రావు మద్దతు కూడా తప్పనిసరి అనేది కేటీఆర్ గ్రహించాలి.