ప్రతీ నెల ఒకటవ తేదీ వచ్చేసరికి సిఎం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసం ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసి వస్తుండటం పరిపాటి. కానీ ఈసారి ప్రధాని నరేంద్రమోడీయే ఈ నెల మొదటి వారంలో ఏపీకి వస్తున్నారు.
స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరానికి వస్తున్నారు. అక్కడ 30 అడుగుల ఎత్తైన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు తమ కుమార్తె హర్షిణిరెడ్డి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు పారిస్ వెళ్ళారు. వారు రేపు సాయంత్రంలోగా గన్నవరం చేరుకొంటారు కనుక సోమవారం భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఆ సమావేశాలలో పాల్గొన్న తరువాత ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు సోమవారం భీమవరం రానున్నారు.
ఏపీలో బిజెపి ఇంకా బలపడలేదు కానీ ఏపీలో నెలకొన్న రాజకీయ, ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులను అవకాశంగా మలుచుకొని వచ్చే ఎన్నికలలో చక్రం తిప్పాలని భావిస్తోంది. గత నెలలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజులు ఏపీలో పర్యటించి జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ కూడా వస్తున్నారు.
కనుక వారిరువురూ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు, రాష్ట్ర బిజెపి నేతలకు ఏమైనా దిశానిర్దేశం చేస్తారా?వారి పర్యటనలో జగన్ ప్రభుత్వంపై ఏమైనా విమర్శలు చేస్తారా?బిజెపి, జనసేనల మద్య ఇంకా స్నేహం కొనసాగున్నందున పవన్ కళ్యాణ్‌తో వారు భేటీ అవుతారా?
ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చంద్రబాబు నాయుడుని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కనుక ఇది బిజెపి-టిడిపిల మద్య మళ్ళీ స్నేహం చిగురింపజేస్తుందా?వంటి పలు సందేహాలకు ప్రధాని నరేంద్రమోడీ పర్యటన తరువాత సమాధానాలు దొరుకుతాయి.



