Pawan-Kalyan-Janasena-Chandrababu-Naidu-TDPఈసారి ఎన్నికలలో టిడిపితో కలిసి పోటీ చేస్తామని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ప్రకటించడంతో ఏపీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. తమతో బీజేపీ కూడా తప్పకుండా కలిసి వస్తుందనే భావిస్తున్నామని పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం దేనికంటే కలిసిరాకపోతే టిడిపితో ముందుకు సాగుతామనే అర్దం. ఈ విషయం బీజేపీ ఆలోచించుకొంటుంది కనుక ఇది అప్రస్తుతం.

టిడిపితో జనసేన పొత్తుకు సిద్దమని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించడమే కాకుండా దీని కోసం టిడిపితో జరిపే చర్చల కోసం జనసేన సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ని నియమించారు కూడా. అయితే ఎట్టి పరిస్థితులలో రెండు పార్టీల మద్య పొత్తులు కుదరకుండా చేసేందుకు వైసీపి అన్ని రకాల కుట్రలకు పాల్పడుతుందని, ముఖ్యంగా జనసేన నేతలను, కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని కనుక వైసీపి ఉచ్చులో చిక్కుకోకుండా పార్టీలో అందరూ జాగ్రత్తగా ఉండాలని పవన్‌ కళ్యాణ్‌ ముందే సూచించారు.

దీని తర్వాత రెండు పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లు కీలకం కానుంది. సాధారణంగా ఈ దశలోనే పార్టీల మద్య పొత్తులు బెడిసికొడుతుంటాయి. ఈసారి జనసేన బలం పుంజుకొంది కనుక కనీసం 50-60 సీట్లు కోరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కానీ ఆ నియోజకవర్గాలలో వాస్తవ బలాబలాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎక్కువ సీట్ల కోసం పట్టుబడితే ఆ సీట్లను స్వయంగా వైసీపికి అప్పగించిన్నట్లవుతుందనే విషయం మరిచిపోకూడదు.

వైసీపి అభ్యర్ధులందరికీ మంచి అంగబలం, అర్దబలంతో పాటు అధికారంలో ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం అంతా వారి గుప్పెట్లోనే ఉంటుంది.

గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు తన నేతల సామర్ధ్యాన్ని, ప్రజలనే నమ్ముకొన్నారు తప్ప ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవాలని అనుకోలేదు. కానీ వైసీపి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ప్రభుత్వ యంత్రాగాన్ని వాడేసుకొంటూ టిడిపిని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు.

కనుక దేశముదురు వైసీపి అభ్యర్ధులను ఎదుర్కొని ఓడించగల సామర్ధ్యం తమ అభ్యర్ధులకు ఉందా లేదా అని జనసేన నిర్మొహమాటంగా ఆలోచించి, ఉందని గట్టిగా నమ్మితేనే సీటు కోసం పట్టుబట్టడం మంచిది. టిడిపి కూడా తమ నేతలను కాదనలేక సీట్ల విషయంలో జనసేనను నొప్పించకూడదు.

చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకి పార్లమెంట్ ఆమోదం లభిస్తే, సీట్ల సర్దుబాటులో మళ్ళీ కొత్త లెక్కలు వేసుకోవలసి వస్తుంది. కనుక మరింత జాగ్రత్తపడటం చాలా అవసరం.

ఒకవేళ వాటితో బీజేపీ కూడా కలిస్తే మూడు పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది కనుక అప్పుడు మూడు పార్టీలు కూడా పట్టువిడుపులు ప్రదర్శించడం చాలా అవసరం.