వచ్చే ఎన్నికలలో టిడిపి కూటమికి కాంగ్రెస్‌తోనే యుద్ధం?

ys-jagan-congress-alliance

సింగిల్ సింహం… అర్జునుడు… యుద్ధం… సిద్దం… ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు జరిగేవరకు జగన్‌ నోట వినిపించిన మాటలివి. టిడిపి, జనసేన, బీజేపీలతో పొత్తులు పెట్టుకోవడం రాజకీయ వ్యభిచారమే తప్ప మరొకటికాదని జగన్‌ వాదించారు.

చంద్రబాబు నాయుడికి తనను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకనే పొత్తులు పెట్టుకున్నారని, కానీ ఎంతమందితో కలిసి వచ్చినా సింగిల్ సింహంవంటి తనను ఎదుర్కొలేరని గట్టిగా వాదించారు.

ADVERTISEMENT

అయితే ఆవిదంగా వాదించడం ద్వారానే వారి పొత్తులతో జగన్‌ తీవ్ర భయాందోళనలు చెందుతున్నారనే విషయం వైసీపి నేతలకు, ప్రజలకు కూడా అర్దమైంది. తర్వాత కధ అందరికీ తెలుసు.

ఎన్నికల ఫలితాలతో కంగు తిన్న జగన్‌ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులకి అంటే… ఆయన భాషలో రాజకీయ వ్యభిచారానికి సిద్దమవుతున్నారనే సంకేతాలు చాలా స్పష్టంగానే కనబడుతున్నాయి. రెండేళ్ల ముందుగానే జమిలి ఎన్నికలు వస్తాయని చాలా ఆశ పడుతున్నారు కూడా.

కనుక కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ముందుగా చెల్లి వైఎస్ షర్మిలతో ఆస్తి పంపకాల విషయంలో రాజీపడేందుకు సిద్దమైన్నట్లు ఆంధ్రజ్యోతి మీడియా చెప్తోంది. కానీ జగన్‌ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దపడితే, కాంగ్రెస్‌ అధిష్టానం కాదంటుందా?

వైఎస్ షర్మిలతో ఆస్తి పంచాయితీ తేల్చుకోవాలని షరతు విధిస్తుందా?అంటే దానికి ఆ అవసరమే లేదని చెప్పవచ్చు. కనుక ఒకవేళ జగన్‌ కాంగ్రెస్‌తో కలిసేందుకు సిద్దమైతే ముందుగా బలయ్యేది వైఎస్ షర్మిలే!

ఇక ఓటమి జగన్‌ ఆలోచనలు, వ్యూహాలలో మార్పు తేగలదేమో కానీ ఆయన గుణగణాలలో ఎన్నటికీ మార్పు రాదు. కనుక చెల్లి కావచ్చు… కాంగ్రెస్‌ కావచ్చు… ఎవరైనా ఆయనకు అధికారం కోసం వాడుకునే ఓ నిచ్చెన మాత్రమే. అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ అయినా సరే కరివేపాకులా తీసి పక్కన పడేయడం ఖాయం. కనుక ఒకవేళ ఆయనని కలుపుకోవాలనుకుంటే ముందు కాంగ్రెస్‌ అధిష్టానమే ఆలోచించుకోవాలి.

జగన్‌ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించి చేతులు కలిపితే వచ్చే ఎన్నికలలో టిడిపి కూటమి వైసీపికి బదులు కాంగ్రెస్‌ పార్టీతో తలపడాల్సిరావచ్చు.

ఇక మరోవిషయం ఏమిటంటే శాసనసభ ఎన్నికలలో, పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీకి క్రమంగా మళ్ళీ బలం పెరుగుతుండగా, బీజేపీకి ప్రజాధరణ తగ్గుతోంది. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం.

కనుక బీజేపీతో పొత్తు వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలపై ఎంతో కొంత నెగెటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

జగన్‌ ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని పావులు కదుపుతున్నందున, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ కూడా వచ్చే ఎన్నికలనాటికి మారాబోయే ఈ పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, వాటి ప్రభావాలను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే అందుకు తగ్గట్లు సమాయత్తం కావడం మంచిది.

ADVERTISEMENT
Latest Stories