బ్రతుకు ఇవ్వడానికే కాదు బతకడానికి కూడానా.?

Rape

సమాజంలో ధర్మం ఎన్ని పాదాల మీద నడుస్తుందో కానీ మహిళలు మాత్రం వారి రెండు కాళ్ళ మీద నడవలేని దుస్థితికి చేరుకున్నారు. వయస్సు తో పని లేదు, వరుస సంగతి అసలే పట్టించుకోరు. నిత్యం ఎదోఒకచోట మగువుల మీద అరాచకాలకు తెగబడుతూనే ఉన్నారు కామాంధులు.

ADVERTISEMENT

ఈ దుస్సాహసానికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా ఏమి లేదు. ఒక రోజు ఢిల్లీలో ఈ ఘోరాలు వెలుగు చూస్తే మరో రోజు ఏపీలో ఇంకోరోజు తెలంగాణలో, మరో రోజు కోల్కత్త ప్రాంతంలో…ఇలా ఈ అరాచక శక్తుల చేతిలో ఎంతోమంది ఆడపిల్లలు తమ భవిష్యత్ ను కోల్పోతున్నారు.

ఈ సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కేసులను తాత్సర్యం చేయడం, చట్టం లోని లొసుగులను వాడుకుని నేరస్తులు పెట్రేగిపోవడం, న్యాయస్థానాలు శిక్షలు వేయడంలో జాప్యం చేయడం ఈ కామాంధులకు చట్టాల మీద ప్రభుత్వాల మీద భయం లేకుండా చేస్తున్నాయి.

అధికారంలో ఉన్నప్పుడు చూస్తాం చేస్తాం అంటూ కాలయాపన చేయడం…ప్రతిపక్షంలోకి రాగానే ఇటువంటి వారి పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ ప్రభుత్వాల మీద పోరాటాలు చేయడం అన్ని రాజకీయ పార్టీలకు ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఆడవారి పై అత్యాచారం అంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ఒక అస్త్రం దొరికింది అంటూ ప్రతిపక్షం, మీ హయాంలో ఎముద్ధరించారు అంటూ ఎదురుదాడి చేయడానికి ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వ రాజకీయం ఏపీ సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందనే చెప్పాలి. బాధ్యత గల పదవులలో ఉన్నవారే మహిళల పట్ల నీచంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం, దుర్మార్గులకు కొమ్ముకాయడం, సోషల్ మీడియాలలో మహిళలు పట్ల అస్లీల పోస్టులు పెట్టడం ఇటువంటి నేరస్తులకు భరోసా కల్పించినట్లయ్యింది.

రాష్ట్రంలో ఎదో నాలుగైదు ‘రేపు’లు జరిగితే ఇంతలా హడావుడి చెయ్యాలా అంటూ మహిళా మంత్రిగా ఉన్న రోజా, అత్యాచారం చేయాలనే ఉద్దేశం కాదు దొంగతనం చేయాలనే భావనతోనే నేరస్తుడు ఇలా చేసాడు అంటూ అప్పటి హోమ్ మంత్రి తానేటి వనిత నొక్కిన సన్నాయినొక్కులు కానీ నేరస్తులకు ప్రభుత్వాల మీద ఉన్న భయాన్ని పోగొట్టాయి.

అయితే గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలకు, బాధితులకు చేయలేకపోయిన న్యాయానికి గాను 11 సీట్లతో ప్రజలు వైసీపీని అధః పాతాళానికి తొక్కారు. అలాగే ఎవరైనా చెడు ఉద్దేశంతో మహిళల మీద చెయ్యి వేస్తె అదే వాడి జీవితంలో ఆఖరి రోజు అవుతుంది అంటూ కూటమి నేతలైన బాబు, పవన్, లోకేష్ లు చెప్పిన మాటలకు ఆకర్షితులైన ప్రజలు వారి ప్రభుత్వ పని తీరు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అయితే నేడు మహిళల పట్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఈ ధమన ఖాండకు కూటమి ప్రభుత్వం కూడా ముగింపు పలకలేకపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటు కాలయాపన చేస్తున్నారే కానీ ఈ అరాచక శక్తులకు అడ్డుకట్ట వేయడం లేదు.

ఒకరికి బ్రతుకు ఇవ్వడానికి పోరాటం చేసే మహిళలు ఇప్పుడు నిత్యం తమ బతుకు కోసం పోరాటం చేసే స్థితికి చేరుకున్నారు. ఒక ఆడపిల్ల జీవితం మూగ జీవాలకన్న హీనమైపోయిందా.? ఒకడు పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తే మరొకడు గొంతుకోసి పరారవుతున్నాడు. ఇంకొకడు చెప్పడానికి, రాయడానికే కాదు కనీసం వినడానికి కూడా భయపడే విధంగా నరకం చూపించి మరి హింసించి చంపుతున్నాడు.

సమాజంలో ఇటువంటి అరాచక శక్తులు ఉపిరికి పీల్చుకోవడానికి కూడా భయపడే చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత న్యాయస్థానాలదైతే వాటిని పకడ్బందీగా అమలు చేయాల్సిన విధి ప్రభుత్వాలదే. ఇటువంటి దారుణాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయం కాకుండా మానవత్వంగా ఆలోచించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి.

ADVERTISEMENT
Latest Stories