గన్నవరం నియోజకవర్గంలో సీనియర్ వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి దానిలో మాట్లాడుతూ, “నేను గన్నవరంలో బలమైన అభ్యర్ధిని కానని సజ్జల నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. పైగా పార్టీలో ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్లు చాలా చులకనగా మాట్లాడారు.
నేను బలమైన అభ్యర్ధినే కాకపోతే 2019 ఎన్నికలలో నాకు గన్నవరం టికెట్ ఎందుకు ఇచ్చారు?అభ్యర్ధిగా బరిలో ఎందుకు దింపారు? అప్పుడు బలమైన అభ్యర్ధిగా కనిపించిన నేను ఇప్పుడు కాకుండా పోయానా?
నేను వైఎస్ కుటుంబం మీద అభిమానంతోనే అమెరికా గ్రీన్ కార్డ్ లభించినా కాదనుకొని వదిలేసి వైసీపీలో చేరి రాజకీయాలలోకి వచ్చాను. అప్పటి నుంచి నేను గన్నవరంలో గడప గడపకి తిరుగుతూ ప్రజల మద్యే ఉంటూ పార్టీని బలోపేతం చేశాను. కానీ ప్రజల మద్యకు వెళ్ళేందుకు భయపడేవారికి టికెట్ ఖరారు చేసి నాకు ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు.
అయినప్పటికీ చివరి ప్రయత్నంగా మరోసారి నేను గన్నవరం టికెట్ ఇమ్మనమని అడిగితే “పార్టీలో ఉంటే ఉండు పోతేపో” అంటూ అవమానించారు. దీని కోసమేనా నేను పార్టీ కోసం ఇన్నేళ్ళు కష్టపడింది?
ఇంతవరకు నేను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరే టిడిపి నేతలను కలవలేదు. గన్నవరం టికెట్ కోసం అడగలేదు. కానీ ఇప్పుడు ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు నాకు టికెట్ ఇస్తే నేను గన్నవరం సీటు గెలుచుకొని మీకు కానుకగా అందిస్తాను.
చివరిగా నన్ను రాజకీయాలలోకి దింపి నడిరోడ్డున వదిలేసి, చివరికి నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని జగన్‌కు ఈ సందర్భంగా థాంక్స్ చెపుతున్నా. ఎందుకంటే నేనేమిటో నిరూపించుకొనే అవకాశం మీరే కల్పించారు కనుక! వచ్చే ఎన్నికలలో గెలిచి టిడిపి ఎమ్మెల్యేగానే శాసనసభలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు గుడ్ బై,” అని యార్లగడ్డ వెంకటరావు అన్నారు.
యార్లగడ్డ గత ఎన్నికలలో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వల్లభనేనీ వంశీ చేతిలో ఓడిపోయారు. కొడాలి నాని, వంశీ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో ఆయన ప్రోత్సాహంతో వంశీ వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచే యార్లగడ్డను పార్టీలో పట్టించుకోవడం మానేశారు.
అయితే ఇంతకాలం సంయమనం పాటించిన యార్లగడ్డ వెంకటరావు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తాడోపేడో తేల్చేసుకొని త్వరగానే వైసీపీ నుంచి బయటపడ్డారు. మరి టిడిపి ఆయనను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇస్తుందో లేదో? చేర్చుకోకపోతే ఆయన పరిస్థితి ఏమిటో?త్వరలోనే తెలుస్తుంది.



