
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కొత్త విషయాలు కనిపెట్టారు. వాటిలో సొంత పార్టీ కోసం ప్రభుత్వ జీతాలతో పనిచేసే వాలంటీర్ వ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాలకు సమాంతరంగా సచివాలయాలు, మూడు రాజధానులు వంటివి చాలానే ఉన్నాయి.
రాజకీయాలలో కొన్ని కొత్త నిబంధనలు సృష్టించాలని ప్రయత్నించారు కానీ అవి కూడా వాలంటీర్లు, మూడు రాజధానుల ఐడియాల్లాగే బెడిసికొట్టాయి. అందుకు ఆయనని తప్పు పట్టలేము.. ఎందుకంటే ఆయన ఈవీఎంల వలననే ఓడిపోయారు కనుక.
Also Read – విదేశీ భాషలు నేర్చుకోవడం గొప్ప కానీ హిందీ కాదా?
రాష్ట్రంలో తనకు నచ్చినట్లే ప్రతిపక్షాలు నడుచుకోవాలని, టీడీపీ, జనసేనలు పొత్తులు పెట్టుకోకూడదని, తప్పనిసరిగా అవి ఒంటరిగానే పోటీ చేసి తనని ఎదుర్కోవాలని హితవు పలికేవారు. కానీ అవి తన మాట వినకుండా పొత్తులు పెట్టుకున్నాయి కనుక అది రాజకీయ వ్యభిచారమేనని జగన్ కనిపెట్టి చెప్పారు. కానీ ప్రజలే అర్దం చేసుకోలేక వాటిని గెలిపించేశారు.
ఎన్నికల వరకు ఈవీఎంల విషయంలో జగన్‌కి ఎటువంటి పిర్యాదు లేదు. కానీ ఓడిపోయాక ఈవీఎంల వల్లనే ఓడిపోయామనే మరో కొత్త విషయం కనిపెట్టి ఈసీని, రాష్ట్ర, దేశ ప్రజలను, ప్రతిపక్షాలను జగన్ అప్రమత్తం చేస్తున్నారు.
Also Read – 2029: ఏపీ vs వైసీపీ..?
ఇన్ని కొత్త కొత్త విషయాలు కనిపెట్టేస్తున్న జగన్ వచ్చే ఎన్నికలకు పాత పద్దతిలోనే అంటే.. బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని కోరుతుండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ మేధావుల ఆలోచనలు సామాన్యులకు అర్దం అవడానికి చాలా సమయం పడుతుంది కనుక బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలనే జగన్ ఆలోచన కూడా బహుశః ఎవరికీ అర్దం కాకపోవచ్చు. ఒకవేళ వాటితో కూడా జగన్ ఓడిపోతే? అని ఇప్పుడే ఎవరూ బుర్రలు బద్దలు కొట్టుకోనవసరం లేదు. ఓడిపోతే ఆయనే చెపుతారు.
జగన్ ప్రస్తుతం కేవలం తాడేపల్లి ప్యాలస్‌కి.. దానిలో సమావేశాలకు వచ్చే వైసీపీ నేతలకు మాత్రమే ముఖ్యమంత్రి కావచ్చు. అయినప్పటికీ ప్రభుత్వం ఎలా నడిపించాలో సిఎం చంద్రబాబు నాయుడుకి మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ విధానాన్ని సిఎం చంద్రబాబు నాయుడు యధాతధంగా అమలు చేస్తే చాలని, అదే సుపరిపాలన అని చెపుతున్నా సిఎం చంద్రబాబు నాయుడు చెవికెక్కించుకోవడం లేదని జగన్ బాధ పడుతున్నారు. ఆయన బాధని వైసీపీ వాళ్ళు మాత్రమే అర్దం చేసుకొని వంత పాడుతున్నారు.
Also Read – అవినీతి కేసులు రాజకీయ కాలక్షేపం కోసమేనా?
రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే సంగతి కూడా తెలియకుండా అజ్ఞానంతో బ్రతికేస్తుంటే వారిని అప్రమత్తం చేసే బాధ్యత కూడా జగనే తీసుకోక తప్పడం లేదు.
ఇలా.. జగన్ అధికారంలో ఉన్నా లేకున్నా కొత్తకొత్త విషయాలు కనిపెడుతూనే ఉన్నారు. శ్రమ అనుకోకుండా రాష్ట్ర రాజకీయాలను, పార్టీలను, ప్రభుత్వాన్ని, ఈసీని పద్దతిగా నడిపించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. కానీ అందరూ ఆయనని అపార్ధం చేసుకొంటున్నారు.. పాపం!