అభిమన్యుడు వంటి ధీరుడు సైతం పద్మవ్యూహంలో అడుగు పెట్టి బయటకు రాలేక వీర మరణం పొందారు. అందుచేత ఎవరైనా వెనక్కి రాలేని పరిస్థితులను ఎదురుకుంటున్న సందర్భంలో పద్మ వ్యూహంలో చిక్కుకున్నారా అంటూ సంబోధిస్తారు.
నేడు వైసీపీ పరిస్థితి చూస్తుంటే ఈ పద్మవ్యూహం అనే పదం గుర్తుకురాక మానదు. సిట్ విచారణ లో బయటకొస్తున్న లిక్కర్ స్కాం ఆధారాలన్నీ వైసీపీ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి, ఆరోపణలన్నీ వైసీపీ నేతల ఇంటి గుండానే నడిపిస్తున్నాయి.
రాజ్ కసిరెడ్డి తో మొదలైన ఈ లిక్కర్ స్కాం తీగ చివరికి మిథున్ రెడ్డి డొంక వరకు చేరింది. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ కీలక నాయకులు, జగన్ సన్నిహితులు, భారతి బంధువులు, భారతి సిమెంట్ ఉద్యోగులు ఇలా అనేకమంది అరెస్టవుతూ వస్తున్నారు.
ఇక రేపోమాపో ఈ స్కాం వెనుక దాగున్న అసలు సూత్రదారులు కూడా తెరమీదకు రానున్నారు, చట్టం తన పని తానూ చేసుకుంటూపోతుంది అంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టి ప్రచారమే జరుగుతుంది.
ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్టు వైసీపీ ని గుక్కతిప్పుకోనివ్వడం లేదనే చెప్పాలి. ఇన్నాళ్లు రాష్ట్ర రాజధాని అమరావతి పై విష ప్రచారంతో బిజీ గా ఉండే వైసీపీ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని లిక్కర్ స్కాం పై అరెస్టవుతున్న వైసీపీ నేతల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం పై పెట్టింది.
సిట్ విచారణతో ఈ కేసులో రోజుకో కొత్త అంశం తెర మీదకొస్తుంది. మొన్న హైద్రాబాద్ ఫామ్ హౌస్ లో 11 కోట్ల భారీ మొత్తాన్ని అధికార బృందం గుర్తించినా వైసీపీ తనకు సంబంధం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది.
ఇక నిన్న ఐటీ మంత్రి నారా లోకేష్ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాం సొమ్మునంతా 400 కోట్ల బంగారంగా మారిందంటూ ఆరోపించారు. ఇక ఇప్పటికే సిట్ విచారణ బట్టి మొత్తం ఈ స్కాం లో 3500 కోట్లు కుంభకోణం జరిగినట్లు ఆధారాలు సేకరించారు.
అలాగే వైసీపీ ప్రభుత్వ హయంలో మద్యం సేవించిన అనేకమంది ఆ బ్రాండ్ల నాణ్యత పై విమర్శలు చేసినవారే. అలాగే గత ప్రభుత్వ హయాంలో మద్యం మరణాల సంఖ్య కూడా భారీ సంఖ్యలో నమోదవ్వడం, మద్యం కొనుగోళ్లు అమ్మకాలు మొత్తం కాష్ రూపంలోనే జరగడం తో వైసీపీ మీద పడుతున్న ఈ అవినీతి మరకలు, అక్రమాల చురకలు ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు.
ఈ అరెస్టులు సక్రమమైనవా.? లేక కక్ష్య రాజకీయాలలో భాగమా.? ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలలో బలమెంతా.? వైసీపీ చేస్తున్న ఎదురు దాడిలో వాస్తవమెంతా.? అధికారులు బయటపెడుతున్న అంకెల లెక్కంతా.? అన్న అనేక అంశాల పై ప్రజలు కూడా పూర్తి అవగాహనలో ఉన్నారు.
దీనితో ఈ లిక్కర్ స్కాం అనే పద్మవ్యూహం నుంచి వైసీపీ బయటపడే అవకాశాలు చాల తక్కువగా కనిపిస్తున్నాయి. వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చెయ్యడానికే జగన్ జైలు యాత్రలు, బలప్రదర్శనాలు, రెచ్చకొట్టే రాజకీయాలు చేస్తూ ఒక రాజకీయ పార్టీని ఈవెంట్ సంస్థగా మారుస్తున్నారు.






