ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా అడిగిన వారికి అడగని వాళ్ళకు వారలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో 45 సంవత్సరాలకే పెన్షన్ అని కూడా ప్రకటించేసారు. ఈ ప్రకటన వివాదాలకు దారితీసింది. ఇటీవలే 45వ పడిలోకి ప్రవేశించిన జగన్ కూడా అర్హుడే అంటూ సెటైర్లు వేస్తున్నారు.
దీనిని సమర్ధించుకునే పనిలో పడ్డారు ఆయన. తాజాగా నలభై ఐదేళ్లకే పేదలుగా ఉన్న ఎస్సి,ఎస్టి,బిసి,మైనార్టీలకు ప్రభుత్వం రెండువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలన్న తన ఆలోచన గురించి ఆ వీడియోలో వివరించారు. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహిళలతో మాట్లాడిన సందర్భంగా ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు చూసి 45 ఏళ్లకే పెన్షన్ అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు జగన్ తెలిపారు.
పేరు ఏదైనా గానీ పేదింటి మహిళలకు నెలనెలా రూ.2వేలు ఇచ్చి ఆదుకోవడమే తమ ఉద్దేశమని జగన్ పేర్కొన్నారు. అంతేకాక అందరికీ వృద్ధాప్య పెన్షన్‌ను 60 ఏళ్లకే ఇస్తామని, వారికి కూడా రూ.2వేలు అందించి ఆసరాగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే వారికి ఏదైనా ప్రత్యేక పేరుతో పెన్షన్ ఇవ్వాలి. అంతేగాని అందరికి అది ఎలా వర్తింప చేస్తారో?



