తండ్రి లేని బిడ్డ, అక్రమంగా కేసులు పెట్టారు, కాంగ్రెస్ పెద్దలు మా పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అన్యాయంగా జైలుకు పంపారు, నాచెల్లి – తల్లి మీ కోసం రోడ్ల మీదకు వస్తున్నారు, నా చెల్లి పై సామజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ రాష్ట్రమంతా చెప్పుకుంటూ తిరిగి సంపాదించిన సానుభూతి తాలూకా విధ్యంసమే నేటి వైసీపీ పాలన అంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించిన మోసగాళ్ల పై సానుభూతి చూపిస్తే చివరికి మన రాష్ట్రం పై సానుభూతి చూపే వ్యక్తులే కరువవుతారని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలే కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత కాంక్షలు నెరవేర్చుకోకూడదు. అవినీతితో అందలం ఎక్కిన నాయకుడికి నిజాయితీ తాలూకా బలం తెలియక పోవచ్చు. నిజాయితీ ముందు ఓటమి చెందినా ఆ ఓటమికి భయపడడు. అదే అవినీతి పరుడు ముందు గెలిచినా తనకు ఓటమి భయం వెన్నంటే ఉంటుందని గ్రహించాలి.
తన తండ్రి మరణానికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీ వర్గాలే అంటూ అప్పట్లో ప్రచారం చేసి ప్రజల సానుభూతి పొందిన జగన్ అదే పెద్దలకు సంబందించిన పరిమల్ ధీరజ్ లాల్ నత్వానీ అనే వ్యక్తికీ తానూ అధికారంలోకి రాగానే ఏపీ రాష్ట్రము తరుపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనినే సానుభూతి తాలూకా అవినీతి అంటారు. తానూ జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు మోసిన తల్లి – చెల్లిని అడ్డుపెట్టుకుని సంపాదించిన సానుభూతితో అందలం ఎక్కడం ఆ తరువాత అందలం ఎక్కించిన వారిని తరిమేయడం కూడా సానుభూతి ద్వారా చేసిన అక్రమమే అవుతుంది.
వివేకా హత్య కేసులో “నారా”వారి రక్త చరిత్ర అంటూ ‘సాక్షి’లో ఎటువంటి “సాక్ష్యాలు” లేకుండా చంద్రబాబు పై వేసిన కథనాలతో రాష్ట్ర ప్రజలలో సంపాదించిన సానుభూతి చివరకు ఏడుపదుల వయస్సులో అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి చేరింది. అక్కడితో ఆగక వివేకా కూతురు సునీత కుటుంబం పై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దిగజారుడు విమర్శలు సానుభూతి తాలూకా ఫలితాలే.
చట్టాల మీద ఉన్న గౌరవంతో, న్యాయవ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో అధికారం ఉంది అనే అహంకారంతో ప్రభుత్వం మోపిన నిందారోపణలను ఈ వయస్సులో ఎదుర్కోవడమే బాబునిజాయితీకి సాక్షిగా నిలిచింది. చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ పలువురు ప్రముఖులు స్పందించిన తీరు, ప్రజలలో ప్రభుత్వ చర్యల పట్ల వచ్చిన వ్యతిరేకత, బాబు అరెస్ట్ పై దేశ వ్యాప్తంగా చేసిన నిరసనలు నిజాయితీ తాలూకా నిదర్శనాలు. నిజాయితితో కూడిన సానుభూతి రాష్ట్ర సంక్షేమాన్ని సూచిస్తుంది. సానుభూతితో కూడిన అధికారం వినాశనానికి నాంది పలకడం వైసీపీ పాలనా తీరుకి అద్ధం పడుతుంది. నిజాయితీకి – సానుభూతికి మధ్య తేడా గమనించే స్థాయికి ప్రజలు ఎదగాలని ఆశిద్దాం.



