ఏపీ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగిరాగానే ఢిల్లీ వెళ్తారని వార్తలు వచ్చాయి. ఇదివరకు ఢిల్లీకి వెళితే అప్పుల కోసమో, కేసుల కోసమో అని అందరూ చెప్పుకొనేవారు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేసిన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది.
కనుక ఆయన చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వివరణ ఇచ్చుకొనేందుకే ఢిల్లీకి వెళుతున్నారనే వాదనలు వినిపించాయి. కానీ జగన్ లండన్ నుంచి వారం రోజులవుతున్నా ఢిల్లీకి వెళ్ళలేదు కానీ ఎప్పటిలాగే రాష్ట్రంలో పర్యటనలు ప్రారంభించారు.
అంటే ఆయనకు మోడీ, అమిత్ షాలు అపాయింట్‌మెంట్లు దొరకలేదా… వారే ఇవ్వలేదా లేక ఇప్పుడు ఢిల్లీకి వెళితే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలులో వేసినందుకు వారిచేత మొట్టికాయలు పడతాయని భయపడి ఆగిపోయారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ ఢిల్లీ వెళ్లకపోవడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పూర్వాపరాలు, అలాగే జగన్ పాలనలో ఏపీలో ఈ రాజకీయ కక్ష సాధింపుల గురించి జాతీయమీడియాకు పూస గుచ్చిన్నట్లు వివరించారు. కనుక ఇప్పుడు ఢిల్లీకి వెళితే వారికి సమాధానం చెప్పుకోలేమని జగన్ ఆగిపోయారా? అనే సందేహం కూడా వ్యక్తం అవుతోంది.
ఇదీగాక మోడీ, అమిత్ షాలు ఇంతవరకు చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించకపోవడం వారి అనుమతితోనే జగన్ ఈ దుస్సాహసానికి పూనుకొన్నారనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కనుక ఒకవేళ ఇప్పుడు వారు జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చి భేటీ అయితే ఆ వాదనలకు బలం చేకూరుతుంది. బహుశః అందుకే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదేమో?
టిడిపితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టేశారు కనుక, జనసేన, వైసీపిలలో ఎటువైపు మొగ్గు చూపాలనేది బీజేపీ అధిష్టానం తేల్చుకోవలసి ఉంది. కారణాలు ఏవైతేనేమీ సిఎం జగన్ ఢిల్లీ బయటలుదేరలేదు. ఎప్పుడు బయలుదేరుతారో తెలీదు. బహుశః హైకోర్టు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టును సమర్ధిస్తే బయలుదేరుతారేమో?