ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అధికార పార్టీ వర్గీయులందరూ గగ్గోలు పెడుతున్న వైనం తెలిసిందే. ఒకప్పుడు రాజధాని రైతులను రెచ్చగొట్టి అమరావతిని అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో, కొన్నాళ్ళ వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీకి కాపు ఉద్యమం తారసపడింది. దీంతో గత ఆరేడు మాసాలుగా కాపులపై విపరీతమైన ప్రేమను కురిపిస్తూ… సదరు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతూ కుల రాజకీయాలు చేసుకుంటోందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే కుల పోరు వైసీపీలో ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి మరో ఉదాహరణ వెలుగుచూసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గురవాచారి టిడిపిలో చేరిన సందర్భంలో చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వైసీపీలో కుల పోరు తారాస్థాయిలో ఉందని చెప్పిన గురవాచారి, వైసీపీలో బడుగు, బలహీన వర్గాలకు అసలు స్థానం లేదని ఆరోపణలు చేసారు. అయితే ఇంతకుమించిన మరొక విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు గురవాచారి.
“తనకు ఆంగ్ల భాష సరిగా రాదని తెలిసి, పార్టీ తరపున తనతో హైకోర్టులో తప్పుడు కేసులు వేయించారని” చెప్పి సంచలన వ్యాఖ్యలకు తెరతీసారు. ఇప్పటివరకు వైసీపీపై చాలామంది చాలా రకాల ఆరోపణలు చేసారు గానీ, మరీ నిరక్షరాస్యతను కూడా పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారన్న అభియోగాలు మొదటిసారిగా వ్యక్తమవుతున్నాయి. చూడబోతుంటే స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ చేయని కార్యమంటూ ఏదీ ఉండదని కాలక్రమేణా రుజువవుతోంది.



