కుటుంబాలు చీల్చి రాజకీయాలు: జగన్‌ కొత్త రాగం!

YS Jagan

నేడు కాకినాడలో జరిగిన పెన్షన్ పెంపు సభలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి సరి కొత్త రాగం ఆలపించారు. అదే… చంద్రబాబు నాయుడు కుటుంబాలు చీల్చి రాజకీయాలు, కుట్రలు చేయబోతున్నారనే రాగం.

జగన్మోహన్‌ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని స్వయంగా చెప్పారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టబోతున్నారు కనుక జగన్మోహన్‌ రెడ్డి తన చెల్లెలి రాజకీయాల గురించి మాట్లాడవలసి ఉంది. కానీ చంద్రబాబు నాయుడుని నిందిస్తున్నారు.

ADVERTISEMENT

జగన్మోహన్‌ రెడ్డి అన్యాయం చేసినందునే వైఎస్ షర్మిల వైసీపిని వీడారు. తల్లివిజయమ్మని జగన్‌ స్వయంగా బయటకు సాగనంపారు. అంటే జగన్‌ తన కుటుంబాన్ని తానే చీల్చుకొన్నరని అర్దమవుతోంది కదా?జగన్ నిరాదరించడం వలననే వైఎస్ షర్మిల తెలంగాణకు వెళ్ళి సొంత పార్టీ పెట్టుకొన్నారు. కానీ ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమెను పార్టీలోకి ఆహ్వానించింది.

రాష్ట్ర విభజనతో నిర్వీర్యమైన ఏపీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం పోసి బ్రటించే బాధ్యత ఆమెకు అప్పగిస్తోంది. కనుక దీనిలో చంద్రబాబు నాయుడుని తప్పు పట్టేందుకు ఏముంది?

నిజానికి జగన్మోహన్‌ రెడ్డి వైఎస్ షర్మిలకి సముచిత స్థానం కల్పించకపోవడం వలననే ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరవలసి వస్తోంది. ఇందుకు జగన్మోహన్‌ రెడ్డి తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడుని నిందిస్తున్నారు.

అయినా ఎన్టీఆర్‌ కుటుంబంలో చిచ్చుపెట్టేందుకు వైసీపి ఎంతగా ప్రయత్నించిందో అప్పుడే జగన్మోహన్‌ రెడ్డి మరిచిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపి బ్యానర్లపై జూ.ఎన్టీఆర్‌ ఫోటోలు ముద్రించడం, లక్ష్మీపార్వతి చేత నందమూరి బాలకృష్ణని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడుకి దూరం చేయాలని ప్రయత్నించడం జగన్‌ అప్పుడే మరిచిన్నట్లున్నారు.

ఎన్టీఆర్‌ కుమార్తె ఆత్మహత్య చేసుకొంటే దానికీ చంద్రబాబు నాయుడే కారణమన్నట్లు దుష్ప్రచారం చేయడం, దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడితే, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఆమె పరితపించిపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలను వైసీపి నేతలు అప్పుడే మరిచిన్నట్లున్నారు.

నారా లోకేష్‌, బ్రాహ్మణి దంపతుల మద్య కూడా వైసీపి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించిన సంగతి మరిచిన్నట్లున్నారు.

నేటికీ జగన్మోహన్‌ రెడ్డి పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన కుటుంబంలో కూడా చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. యధారాజా తధాప్రజా అన్నట్లు వైసీపి నేతలందరూ తమ అధినేతనే ఫాలో అయిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఇలా రాజకీయాల ముసుగులో తమ రాజకీయ ప్రత్యర్దుల కుటుంబాలలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ షర్మిలతో ఎక్కడ చేతులు కలుపుతారో అని అప్పుడే భయపడుతున్నట్లున్నారు. ఆ భయమే ఆయన చేత ఈ కొత్త రాగం ఆలపింపజేస్తోంది. అధినేత కొత్త రాగం ఆలపించారు కనుక ఇక వైసీపిలో అందరూ దానికి తాళం వేస్తూ కోరస్ పాడక తప్పదు. వైఎస్ షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టగానే వారి కచేరీ మొదలవవచ్చు. బహుశః సజ్జల ఇచ్చిన నోట్స్ చూసుకొని రిహార్సల్స్ చేసుకొంటున్నట్లున్నారు.

ADVERTISEMENT
Latest Stories