ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కర్నూలు జిల్లాలో మూడు రోజుల జలదీక్షను చేపట్టిన వైకాపా అధినేత వైఎస్ జగన్… ఎగువన ఉన్నామన్న ఏకైక కారణంతో, గోదావరి నదీజలాల్లో అధిక వాటాను బలవంతంగా తీసుకుంటూన్నారని ఆరోపిస్తూ, “కేసీఆర్ ఆయనిష్టం వచ్చినట్టుగా వాటా లెక్కలు చెబుతున్నారు. నేనడుగుతా ఉన్నా, ఇదే కేసీఆర్ గారిని… ఎవడబ్బ సొత్తబ్బా ఇదని? ఎవడు చెప్పాడయ్యా నీకు, గోదావరి నీటిలో 954 టీఎంసీల వాటా ఉందని?” ప్రశ్నించారు.
“ఎవడూ చెప్పలా… ఆయనిష్టం వచ్చినట్టుగా… ఆయన ప్రాజెక్టులు కడతా ఉన్నాడు కాబట్టి… ప్రాజెక్టుల్లో నిల్వ ఉండే నీటిని లెక్కగట్టుకుని, ఇది నా అవసరం, ఇవీ నా కేటాయింపులు, నేనే ఈ నీళ్లు తీసుకుంటా, మిగిలితేనే మీకు పంపిస్తా అంటూ… ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్న తీరు… ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతావున్నా…” సమస్యను పరిష్కరించేందుకు అటు కేసీఆర్, ఇటు చంద్రబాబు ముందడుగు వేయకుంటే, రెండు రాష్ట్రాల మధ్యా ‘భారత్ – పాక్ సరిహద్దు’ ఏర్పడుతుందని హెచ్చరించారు.
అయితే జగన్ చేసిన ఈ విమర్శల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణాలో వైసీపీ పూర్తిగా ఖాళీ కావడంతో ఇక పార్టీపై దృష్టి పెట్టాల్సిన పని లేకపోవడంతో… రాజకీయంగా కేసీఆర్ అవసరం లేదన్న నిర్ణయంతోనే జగన్ తీవ్ర విమర్శలకు దిగారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదీ గాక, ఏపీ ప్రయోజనాలను దెబ్బ కొడుతున్న కేసీఆర్ నిర్ణయాలను విభేదించని పక్షంలో ప్రజలలో తప్పుడు సంకేతాలను పంపినట్లుగా అవుతుందని… తప్పని పరిస్థితులలో విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద కేసీఆర్ ను జగన్ విమర్శించడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.



