చంద్రబాబు అరెస్ట్ పై సెటైర్లతో స్పందిస్తున్న వైసీపీ నేతలు తమ అధినేత బెయిలు మీద రాష్ట్రాన్ని నడిపిస్తు న్నాడు అనే కనీస సృహ కూడా లేకుండా చేస్తున్న విమర్శలు వారి సాక్షి కథనాల మాదిరే ఉన్నాయి. చంద్రబాబు అవినీతి నిజం కాబట్టే కోర్టులు బెయిలు ఇవ్వలేదు అంటూ వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ చేసిన విమర్శలు ఇటు చంద్రబాబు తోపాటు అటు జగన్ కు తగిలేలా ఉన్నాయి.
జగన్ అవినీతి నిజం కాబట్టేనా బెయిలు రాక పదహారు నెలలు జగన్ జైలులో ఉండాల్సి వచ్చింది? వైసీపీ పార్టీ నేతల మీద ఉన్న అవినీతి కేసులతో పోటీ పడే స్థాయిలో రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు లేరు అనే సత్యాన్ని వైసీపీ నాయకులు ఎప్పటికి గ్రహిస్తారో అంటూ టీడీపీ నేతలు జగన్ గత చరిత్రను తవ్వుతున్నారు.
ముఖ్యమంత్రికి బెయిలు రద్దయితే ఏక్షణంలో అయినా జగన్ కూడా అదే జైలుకు వెళ్లాల్సిందే అంటూ తెలుగు తమ్ముళ్లు వైసీపీ నేతలకు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన బాబుకి మద్దతు ఎలా పలుకుతారు అంటూ పవన్ పై విరుచుకుపడుతున్న వైసీపీ నాయకులు ఒక్కసారి అయినా ఆత్మ సాక్షితో ఆలోచిస్తే ఇటువంటి విమర్శలకు తావుంటుందా!
అవినీతి చేస్తేనే జైలుకు వెళ్తారు , అవినీతి నిజమైతేనే కోర్టులు బెయిలు నిరాకరిస్తాయి, జైలుకు వెళ్లిన వారంతా నేరస్తులే అనే వైసీపీ నాయకులు తమ పార్టీలో ఎంతమంది నేతల మీద కేసులు ఉన్నాయో, ఎంతమంది నేతలు బెయిలు మీద బయటున్నారో, ఎంతమంది నేతల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయో కూడా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుంది.
రాజకీయాలలో కోర్టులు – కేసులు – జైళ్ళు – బెయిల్లు అనేది సర్వసాధారణం. 32 కేసులలో A 1ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలు జీవితం గడిపి వచ్చిన జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటేనే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణీతలు అనేది వైసీపీ నేతలు గుర్తించాలీ.



