జగన్ తన తల్లికి, చెల్లిని తన రాజకీయ ఎదుగుదలకి వాడుకున్నారే కానీ వారికి భరోసా ఇవ్వలేకపోయారు. ముందు చెల్లిని, తర్వాత తల్లిని బయటకు గెంటేశారు. వారు తిరిగివస్తే ఇది నా ఆస్తి. దీనిలో మీకు చిల్లి గవ్వ ఇవ్వనని నిష్కర్షగా చెప్పేశారు. కానీ వాళ్ళు అడుగుతున్నందుకు ఇద్దరినీ సొంత పార్టీ నేతలతో తిట్టించి, సొంత మీడియాలో వారిరువురూ గురించి ఏదేదో వ్రాయించారు.
మాట తప్పని మడమ తిప్పని జగన్ వాలంటీర్లను 5 ఏళ్ళు వాడుకున్నారు. అవసరం తీరాక వారందరినీ రోడ్డున పడేసిపోయారు. అంతకు ముందు తెలంగాణలో వైసీపి నేతలను అలాగే వాడుకొని రోడ్డున పడేసి ఏపీకి వచ్చేశారు. చివరికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా జగన్ నమ్మలేదు. వారిని దూరంగానే ఉంచారు. ఎన్నికలప్పుడు వారిలో అనేకమందిని పక్కన పెట్టేశారు.
ఈవిదంగా అందరికీ హ్యాండ్ ఇచ్చిన జగన్ కొంతమందిని మాత్రం గట్టిగా వెనకేసుకువస్తుంటారు. ఉదాహరణకు అక్రమాస్తుల కేసులో ఏ-2గా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డిని, బాబాయ్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని, సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వారి కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే వర్రా రవీంద్ర రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ వంటివారికి అండగా నిలబడుతుంటారు.
వారందరూ అమాయకులు, చిన్న పిల్లలు, ప్రశ్నించే గొంతుకలంటూ జగన్ వారినీ, వారు చేసిన నేరాలను కూడా వెనకేసుకువస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తల్లి, చెల్లి, బాబాయ్, వాలంటీర్లను కాదని ఇటువంటి వారిని వెనకేసుకువస్తున్న జగన్ మనస్తత్వం ఎటువంటిదో అంచనా వేయవచ్చు.
తాజాగా పోలీసులు వైసీపి సోషల్ మీడియా ‘బూతుల విభాగం వారియర్’ ఇంటూరి రవికిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో ఆయన భార్య తాడేపల్లి ప్యాలస్‌కు వెళ్ళి జగన్‌ని కలిసి తన భర్తను కాపాడమని వేడుకున్నారు. వెంటనే జగన్ ఆమె భర్తకి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
జగన్ సొంత తల్లికి, చెల్లికి భరోసా ఇవ్వలేకపోయినా, ఇటువంటి హేయమైన నేరాలు చేస్తున్నవారికి అండగా నిలబడుతుంటారని నిరూపించుకున్నారు కనుక ఇంటూరి రవికిరణ్ విషయంలో ఆమె జగన్‌ని నమ్ముకోవచ్చు.




