అధికారం పోయిన వైసీపీ నేతలకు అహంకారం పోలేదా అనేలా మళ్ళీ ఒక్కో వైసీపీ నేత మీడియా ముందుకు వచ్చి అవే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. జగన్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ కొడాలి నాని, మేము మంచి చేసి ఓడిపోయాం మాకెందుకు సిగ్గు అంటూ రోజా, లక్షలు ఖర్చు పెట్టి బాత్ రూమ్స్ నిర్మిస్తే తప్పెమేముంది అంటూ అంబటి.
మంత్రులుగా ఉంటూ బూతులు తిట్టినందుకే ఓడిపోయాం అంటున్నారుగా ఇప్పుడు ఆమంత్రి పదవి అనే అడ్డు కూడా లేదు ఇప్పుడు గతం కంటే డబుల్ స్థాయిలో రెచ్చిపోతాం అంటూ అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఒక్కో వైసీపీ నేత కూడా ఓటమికి గల కారణాల మీద సమీక్ష చేసుకోకుండా, ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రజల సహనాన్ని పరీక్షించాడనికి డ్యూటీ ఎక్కారు.
“యథా రాజా తథా ప్రజా”…”ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా”.? అన్నట్టుగా అధినేత జగన్ లోనే మార్పు రాకపోతే ఇంకా ఆ పార్టీ నేతల ఆలోచనలలో మార్పు సాధ్యమవుతుందా.? ఇప్పటికి ప్రతి ఇంటికి మంచి చేసాం, ఏనాడూ చూడని సంక్షేమాన్ని మా ప్రభుత్వంలో ప్రజలకు డోర్ డెలివరీ చేసాం, ఎన్నో వేల కోట్లు బటన్ నొక్కాను, అక్కచెల్లమ్మల ఆశీస్సులు ఎటు పోయాయి అంటూ ఇంకా అవే సింపతీ కబుర్లు చెప్పుకుంటున్నారు జగన్.
నిజాయితీగా ఉన్నాను, అబద్దాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు, అవినీతికి అవకాశం ఇవ్వలేదు, పేదవాడి కోసం ఇల్లు నిర్మించాం అయినా ఎందుకు ఓడిపోయాం అంటూ తనకు తానే భజన కొట్టుకుంటున్నారు కానీ అసలు ప్రజలకు ఏం కావాలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పటికి తెలుసుకోలేకపోతున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీ పార్టీకి ఇంత ఘోర ఓటమి ఎదురైనా బటన్ నొక్కాను అంటున్నారే తప్ప అభివృద్ధి చేశాను అనే మాట జగన్ నోట రావడమే లేదు.
అదొక్కటి జగన్ గుర్తిస్తే ప్రజలు ఈ తరహా తీర్పు వైసీపీ కి ఎందుకు కట్టబెట్టారో ఇట్టే అర్ధమవ్వుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి, పూర్తిగా బాధ్యతలు చేపట్టక ముందే రాజధాని అమరావతి రూపురేఖలు మారిపోయాయి. బాధ్యతలు తీసుకున్న మంత్రులు ఆయా శాఖల మీద సమీక్షలు నిర్వహిస్తూ గాడితప్పిన వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు.
గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎన్నడూ మీడియా ముందుకు వచ్చింది కానీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది కానీ శాఖల మీద సమీక్షలు జరిపింది కానీ ఎన్నడూ చూడని ప్రజలు ఇప్పుడు మాత్రం రోజుకో శాఖ మీద సమీక్షలు జరుపుతూ ప్రస్తుత పరిస్థితులను ప్రజల ముందు పరుస్తున్న బాబు ని చూస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి బాబు పాలనకు ఉన్న తేడా ఏంటో ఈ వారం రోజులలో ప్రజలకు అర్ధమయ్యింది కానీ జగన్ కు అవగాహన రావడం లేదు.
శకుని పాచికలు ఇంటర్ వెల్ మాత్రమే, అంతిమంగా ధర్మమే గెలుస్తుంది, అర్జునుడి మాదిరి మళ్ళీ అస్త్రాలతో తిరిగి వస్తాం అంటూ పార్టీ శ్రేణులకు ఓటమి మీద అధైర్యపడవద్దు అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జగన్. అవును జగన్ చెప్పినట్లు ధర్మమే గెలుస్తుంది…ధర్మమే గెలిచింది కూడా అంటున్నారు కూటమి మద్దతుదారులు.




