హైకోర్టులో చెవిరెడ్డికి ఎదురుదెబ్బ.. గుంటూరు జీజీహెచ్ సూపరిండెంట్ ప్రభావతికి హైకోర్టులో ఎదురు దెబ్బ.. సుప్రీంకోర్టులో మాజీ వైసీపీ ఎంపీ నందిగామ సురేష్‌కి ఎదురుదెబ్బ.. కాకినాడ పోర్టు కబ్జా కేసులో విజయసాయి రెడ్డిని విచారించిన ఈడీ, గోదాములలో బియ్యం దొంగతనం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి నోటీసులు.. మాజీ సీఐడీ ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి అనుమతి… ఇలా ప్రతీరోజూ మీడియాలో కేసులు, నోటీసులు, అరెస్టులు, ఎదురుదెబ్బల వార్తలు చదువుతున్నప్పుడు వైసీపీలో అందరికీ నేర చరిత్ర ఉందని ప్రజలు భావించడం సహజం.
వైసీపీ హయాంలో వారి అవినీతి, అరచకాలు సామాన్య ప్రజలు కూడా కళ్ళారా చూశారు కనుక నేర చరిత్ర, నేర ప్రవృతీ కలిగిన వారందరూ వైసీపీ గొడుగు కింద చేరారని భావించడం సహజం.
Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!
వైసీపీ నేతలు సరే.. కానీ వారి ఒత్తిళ్ళకు తలొగ్గి లేదా వారి అండదండలు చూసుకొని కొందరు అధికారులు చెలరేగిపోయారు.
ఉదాహరణకు సొంత ఎంపీ రఘురామ కృష్ణరాజుని చిత్రహింసలు పెట్టిన కేసులో మాజీ సీఐడీ ఏఎస్పీ విజయపాల్ గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా ఇదే కేసులో గుంటూరు జీజీహెచ్ సూపరిండెంట్ ప్రభావతికి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది.
Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!
జగన్ పాలనలో ఈవిదంగా తప్పుడు పనులు చేసిన అధికారులు ఇంకా చాలా మందే ఉన్నారు. వారందరి జాబితా చాలా పెద్దదే ఉంది. వారందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుండటం గమనిస్తే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థలను ఎంతగా భ్రష్టు పట్టించేశారో అర్దమవుతుంది.
జగన్ కారణంగా ఇంతమంది వైసీపీ నేతలు, సోషల్ మీడియా వారియర్స్, అధికారులు కేసులలో చిక్కుకొని అష్టకష్టాలు పడుతుంటే, జగన్ మాత్రం హాయిగా తాడేపల్లి ప్యాలస్‌లో సేద తీరుతూ ఎప్పటిలాగే రాజకీయాలు చేసుకుంటున్నారు.
Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!
వైసీపీ నేతల మెడలకు కేసులు చుట్టుకుంటే వారు అవలీలగా బయటపడగలరు. ఉదాహరణకు జగన్, విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, జోగి రమేష్, పేర్నినాని, అనంత బాబు వంటివారు మన కళ్లెదుటే ఉన్నారు. కానీ వారి ఒత్తిళ్ళకు లొంగి అధికారులు తప్పుడు పనులు చేస్తే ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందో స్పష్టమవుతోంది.
జగన్ అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో శ్రమించిన వైసీపీ కార్యకర్తలను పక్కన పెట్టేసి వాలంటీర్లను చంకనెక్కించుకున్నారు.
ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, వాలంటీర్లను పక్కన పడేసి ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలే తనకు చాలా ముఖ్యమని, వైసీపీ జెండా మోసిన ప్రతీ కార్యకర్తని కాపాడుకుంటానని జగన్ నమ్మబలుకుతున్నారు. కనుక జగన్ మాటలు నమ్మి ఆయన కోసం పనిచేయాలనుకునేవారు ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. లేకుంటే ఏమవుతుందో వాలంటీర్లు, ఈ కేసులు, అరెస్టుల కధలు చెపుతున్నాయి కదా?