ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ని పరామర్శించారు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆయనకు బొకే ఇచ్చి సాదరంగా ఆహ్వానించగా, జగన్ ఆయనను ఆప్యాయంగా పలకరించి కౌగలించుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్‌ని పరామర్శించారు.
కేసీఆర్ ఇటీవలే తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకొంటున్నందున, జగన్ ఆయనను పరామర్శించడం సహజమే.
రాజకీయాలలో పరామర్శలు మామూలే. కేసీఆర్ తీవ్రంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి ఆయనని పరామర్శించి వచ్చారు. కనుక జగన్ తన రాజకీయ గురువు కేసీఆర్‌ని పరామర్శించడాన్ని తప్పు పట్టలేము. కానీ ఈ పరామర్శలు, కౌగిలింతలు కేసీఆర్-జగన్ మద్య ఎంత బలమైన బందం ఉందో తెలియజేస్తోంది కదా?
వారి మద్య ఇంత బలమైన అనుబంధం ఉన్నప్పుడు, తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏపీ సాగునీటి శాఖ అధికారులు, పోలీసులను నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు ఎందుకు దండయాత్రకు పంపించారు?సిఎం జగన్ ఆదేశం మేరకే వారు డ్యామ్ మీదకు దండయాత్ర చేసి 13 గేట్లు స్వాధీనం చేసుకొన్నారని మంత్రి అంబటి రాంబాబు స్వయంగా చెప్పారు. ఏపీ రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసమే జగన్మోహన్ రెడ్డి అంత సాహసం చేశారని ఆత్మసాక్షి స్తుతించింది కూడా!
కానీ దాంతో తెలంగాణ సెంటిమెంట్ రగిలించి బిఆర్ఎస్ పార్టీకి తోడ్పడేందుకే పోలింగ్ సమయంలో జగన్ ఈ డ్రామా ఆడించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆరోపణలను మంత్రి అంబటి రాంబాబు ఖండించారు.
కానీ ఈరోజు జగన్-కేటీఆర్ పలకరింపులు, కౌగలింతలు చూసినప్పుడు ఆ డ్యామ్ డ్రామా నిజమా… అబద్దామా?అనే సందేహం కలగకమానదు.
ఆ డ్యామ్-డ్రామాతో తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసిన్నట్లే, ఏపీలో బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ యాక్టివ్ చేయించి ఏపీ ప్రజలలో కూడా ఏపీ సెంటిమెంట్ రగిలించి, వైసీపి వ్యతిరేక ఓట్లు చీల్చి తనకు తోడ్పడాల్సిందిగా జగన్ కోరకుండా ఉంటారా? ఆయన మనసులో మాటనే జగన్ కోరితే కేసీఆర్ కాదంటారా?కనుక ఈ పరామర్శ ఆషామాషీ పరామర్శగా భావించలేము. త్వరలోనే దీని ప్రభావం ఏపీ రాజకీయాలలో తప్పక కనిపిస్తుంది. నో డౌట్!




