నువ్వొస్తానంటే… మేము వద్దంటాము!

ys-jagan-mohan-reddy

అక్కడ కేసీఆర్‌, ఇక్కడ జగన్‌ గృహ నిర్బందం విధించుకొని ఇళ్ళలోనే ఉండిపోయారు. ఇద్దరూ సంక్రాంతి తర్వాత ప్రజల మద్యకు వచ్చి అధికార పార్టీలను ‘రఫ్’ ఆడించేస్తారని ఆ పార్టీల నేతలు, వారి సొంత మీడియా గ్యారెంటీ ఇస్తోంది. వారి ప్రగల్భాలు పక్కన పెడితే ఇద్దరూ తప్పనిసరిగా తమ బోనులలో నుంచి బయటకు రావలసిన అవసరం కనిపిస్తోంది.

కేసీఆర్‌ విషయానికి వస్తే, ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండిపోయినా ఇంతకాలం కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ కలిసి బిఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నారు. కానీ ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ త్వరలోనే జైలుకి వెళ్ళక తప్పకపోవచ్చు. రెండు నెలల్లో బయటకు వచ్చేయగలనని కేటీఆర్‌ అనుకుంటున్నప్పటికీ, ఈడీ కూడా వేరేగా కేసు నమోదు చేసింది కనుక కనీసం మరో 4-5 నెలలైన జైల్లో యోగా ప్రాక్టీస్ తప్పకపోవచ్చు.

ADVERTISEMENT

హరీష్ రావు, కల్వకుంట్ల కవితలపై పార్టీని వదిలేయడం సాధ్యం కాదు. కనుక సంక్రాంతి పండుగ తర్వాత కాకపోయినా కేటీఆర్‌ లోపలకు వెళ్ళిన తర్వాత అయినా కేసీఆర్‌ బయటకు రాక తప్పదు.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉంటే బిఆర్ఎస్ పార్టీ నడిపించేందుకు కనీసం కొడుకు, మేనల్లుడు, కూతురు ముగ్గురున్నారు. కానీ జగన్‌కి ఒక్కరూ లేరు. కనుక తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి జనం మద్యకు రాక తప్పదు.

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి, కేసీఆర్‌ బయటకు రాకపోయినా పార్టీ శ్రేణులను కేటీఆర్‌, హరీష్ రావులు యాక్టివ్‌గా ఉంచుకున్నారు. కనుక ఇప్పుడు కేసీఆర్‌ వస్తేమరింత యాక్టివ్ కావచ్చు.

కానీ వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి జగన్‌ ప్యాలస్‌ రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తుండటం, కేసుల భయంతో వైసీపీ నేతలు కూడా మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటుండటంతో ఏపీలో వైసీపీ శ్రేణులు చాలా ఢీలా పడ్డాయి.

పైగా 2024 ఎన్నికలు వైసీపీ నేతలకు జీవన్మరణ సమస్యగా మారడంతో ప్రతీ ఒక్కరు 5 ఏళ్ళుగా దోచుకొని దాచుకున్న డబ్బుని మంచి నీళ్లలా ఖర్చుపెట్టేశారు. ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయింది కానీ ఎవరూ గెలవలేకపోయారు.

జగన్‌ తప్పకుండా తమకే టికెట్స్ ఇస్తారనే నమ్మకం పెట్టుకున్నవారు కూడా గత 5 ఏళ్ళుగా పార్టీ కార్యక్రమాల కోసం భారీగా ఖర్చు పెట్టారు. కానీ చివరి నిమిషంలో జగన్‌ హ్యాండ్ ఇవ్వడంతో వారూ దెబ్బైపోయారు.

కనుక ఇప్పుడు జగన్‌ జనం మద్యకు బయలుదేరితే జనసమీకరణకు, రోడ్ షోలు, ర్యాలీలకు, సభలకు, వాహనాలకు, స్వాగతం బ్యానర్లు, జగన్‌ పోస్టర్లకు ఆయా ప్రాంతాలలో వైసీపీ నాయకులే జేబులో నుంచి డబ్బు తీసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలలో పోటీ చేసి దివాళా అయిపోయామని బాధపడుతున్న వైసీపీ నేతలు ఇప్పుడు జగన్‌ పర్యటనల కోసం ఖర్చు చేయాలంటే చాలా కష్టమే. అలాగని జగన్‌కి జేబులో నుంచి డబ్బు తీసిచ్చే అలవాటే లేదు.

పైగా ఇప్పుడు ఎంత హడావుడి చేసినా కనీసం ఇప్పుడప్పుడే జమిలి ఎన్నికలు కూడా జరుగవు కూడా. కనుక మరో ఏడాదిపాటు ప్యాలస్‌లోనే కూర్చొని ట్వీట్స్ వేసుకుంటే బాగుంటుంది కదా?అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమేగా?

ADVERTISEMENT
Latest Stories