మొండోడు జగన్ మోహన్ రెడ్డి

YS Jagan Mohan Reddy Sankalpa Yatraఏడాదికిపైగా ప్రజలతో మమేకమైన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తి అయ్యింది. ఏకంగా 3,648 కిలోమీటర్లు సాగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ఇచ్చాపురంలోని భారీ బహిరంగసభతో ముగించారు. మండుటెండైతేనేం..జోరువానైతేనేం.. ఎముకలు కొరికే చలైతేనేం.. లెక్క చేయ్యకుండా అలుపెరుగని పాదయాత్ర చేశారు ఆయన. తన కష్టాన్ని ప్రజలు గుర్తిస్తారని తనకు వచ్చే ఎన్నికలలో పట్టం కడతారని ఆత్మవిశ్వాసంతో తన నడకను ముగించారు జగన్.

ADVERTISEMENT

తండ్రి శవం పక్కన పెట్టి సంతకాలు సేకరించారు… లక్ష కోట్ల అవినీతి చేశారు… పదవీ కాంక్ష… నిగ్రహం లేని ఆవేశం… రాజకీయాన్ని ద్వేషంగా మార్చుకున్న వైనం.. 16 నెల జైలు జీవితం… ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి రావడం… ఇలా జగన్ పై కిట్టని వారు ఏవైనా ఆరోపణలు చేయ్యవచ్చు అయితే ఆయన కష్టాన్ని మాత్రం ఎవరూ కాదనలేని సత్యం. ఒక ఆశయం కోసం ఆయన పట్టిన ఉడుం పట్టు 45 ఏళ్ళ ప్రాయంలో ఎవరికైనా ఆదర్శప్రాయమే. కేసులు చుట్టుముట్టినప్పుడైనా, ప్రతిపక్షంలో కూర్చునప్పుడైనా ఆయన ప్రజలనే నమ్ముకున్నారు.

ప్రజలలో తిరిగితే వారే తాను అనుకున్నది చేసిపెడతారని బలంగా నమ్మి ఓదార్పు యాత్ర అని ప్రజాసంకల్ప పాదయాత్ర అని పేరు ఏదైనా కానీ ఆయన ప్రజల మధ్యే ఉన్నారు. రాజకీయాలలో జగన్ వేసిన తప్పటడుగులు తక్కువేమీ కాదు… అవి ఆయనను 2014లో ప్రతిపక్షంలో కూర్చోబెట్టాయి అయితే ఆయనకు ఉన్న ఒకే బలం ప్రజలను నమ్ముకోవడం వారి మధ్యనే ఉండడం. 2014లో చేసిన తప్పులని సవరించుకుని ముందుకు వెళ్తే అధికారం ఖాయమని పార్టీ శ్రేణుల నమ్మకం.

ఆ ఆత్మవిశ్వామే ఆయనను 3650 కిలోమీటర్ల పాటు నడిపించింది. అయితే జగన్ ఓడిపోయిన రోజు ఆయన చుట్టూ ఉన్న జనం ఎక్కువే ఇప్పుడు వస్తున్న జనం ఎక్కువే. జనాన్ని బట్టి అధికారంలోకి వస్తామని అంచనా వెయ్యగలమా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎన్నికలకు ముందు ఈ మూడు నెలలు దానికి చాలా కీలకం. గతంలో చేసిన తప్పులు మాళ్ళీ చెయ్యరనుకుంటూనే ఆశావాద దృక్పధంతో ముందుకు సాగుతున్నారు వైఎస్సార్ దండు. చూద్దాం కాలం ఆయనకు ఏమి రాసి పెట్టిందో!

ADVERTISEMENT
Latest Stories