ఆంధ్రప్రదేశ్ కు “ప్రత్యేక హోదా” ఖచ్చితంగా రాదు అని తెలిసిన నాటి నుండి, రాజకీయ లబ్దే లక్ష్యంగా సందడి చేస్తున్న వైసీపీ అధినేత జగన్, తన వద్ద ఓ బ్రహ్మాస్తముందని, అవసరమైతే దాన్ని బయటకు తీస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రాత్రి వివిధ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్, హోదాపై పోరులో తుది అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని అన్నారు.
తెలుగుదేశం అందుకు సిద్ధమంటే, ఇప్పుడే రాజీనామాలకు చేసి వెళ్దామని చెప్పారు. హోదా కోసం పోరులో ఎవరు కలిసొచ్చినా తమకు అభ్యంతరం లేదని, పార్లమెంటు వేదికగా పోరాడాల్సింది ఎంపీలే కాబట్టి, చిట్టచివర రాజీనామాలు చేయిస్తానని వెల్లడించారు. ఏపీకి హోదా వస్తే పిల్లలు ఉద్యోగం కోసం కర్ణాటకకో, తమిళనాడుకో వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఆదాయపు పన్ను మినహాయింపు, రవాణా రంగాల్లో రాయితీలు, ఎక్సైజ్ సుంకాల రద్దు వంటి అంశాలతో ఇప్పుడు తనతో మాట్లాడుతున్న ఎన్నారైల్లోని ఎందరో వచ్చి పెట్టుబడులు పెడతారని అన్నారు.
అలాగే ప్రతి జిల్లా హైదరాబాద్ గా మారుతుందని, ప్యాకేజీతో ఒక్క పరిశ్రమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అని వెంకయ్యను ప్రశ్నించిన జగన్, ప్రస్తుతానికి ఏపీ పక్క రాష్ట్రాలతో పోటీ పడే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. ఇంత చెప్పిన జగన్ మరో మాట కూడా చెప్పారు… ఏపీ ‘ప్రత్యేక హోదా’ ఒక్క ప్రధాని మోడీ చేతుల్లోనే ఉందని, ఆయన తలచుకుంటే ఇస్తారని చెప్పి… చంద్రబాబుపై విమర్శలు చేసారు. అదే కదా జగన్ స్పెషాలిటీ అంటున్నారు నెటిజన్లు. గతంలో విభజన సమయంలో ఇలాగే ‘బ్రహ్మాస్త్రం’ ఉందంటూ కాంగ్రెస్ తో పాటు జగన్ చేసిన హంగామా రాజకీయ విజ్ఞులకు సుపరిచితమే.



