ఏపీ సిఎం జగన్ ముందస్తు ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారా?అంటే పార్టీలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ అదే సూచిస్తున్నాయి. వైసీపి ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా దాదాపు టిడిపిలు ముఖ్య నేతలందరిపై అనేక కేసులు నమోదు చేసింది. వాటన్నిటి నుంచి వారు ఎప్పటికప్పుడు బయటపడి తామే పైచేయి సాధించామని సంబరపడేవారు.
అయితే వారు తప్పించుకోవడానికి వీలులేని కొన్ని కేసులను వైసీపి ప్రభుత్వం ఇంతకాలం పక్కన పెట్టుకొని తాపీగా కూర్చొని, ఇప్పుడు వాటిని ఒకటొకటిగా బయటకు తీయడం మొదలుపెట్టింది. వాటిలో మొదటి కేసుతోనే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి, జైలుకి కూడా పంపించి సంచలనం సృష్టించింది. ఆ కేసు నుంచి ఆయన బయటపడేలోగా మరో కేసు నమోదు చేయించింది.
ఇంకా ఇటువంటి కేసులు చాలా ఉన్నాయని, వాటిలో నారా లోకేష్, అచ్చెనాయుడుతో సహా టిడిపి ముఖ్యనేతలందరినీ పదేపదే అరెస్ట్ చేసి జైళ్ళకు పంపుతూనే ఉంటామని మంత్రి రోజా బయటపెట్టారు. అంటే టిడిపి ముఖ్యనేతలందరినీ ఈ కేసులతో ఉక్కిరిబిక్కిరిచేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళితే అవలీలగా విజయం సాధించగలమని వైసీపి ఆలోచనగా కనిపిస్తోంది.
మరోపక్క టిడిపి ఇంకా అభ్యర్ధులను ఖరారు చేసుకోవలసి ఉంది. టిడిపి-జనసేనలు పొత్తులు పెట్టుకోవాలా వద్దా? పెట్టుకొంటే ఏవిధంగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలని ఇంకా ఆలోచించనే లేదు. కనుక ఈ ఆలోచనలు, సర్దుబాట్లు చేసుకొనేందుకు వాటికి అవకాశం లభించకూడదంటే ముందస్తుకు వెళ్ళడమే ఉత్తమం.
మరో ముఖ్యవిషయం ఏమిటంటే, ఈ కష్టకాలంలో టిడిపికి, చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడేందుకు పవన్ కళ్యాణ్ బహిరంగంగా ముందుకు రావడంతో బీజేపి అధిష్టానం ఆయనను నమ్మలేని పరిస్థితి కల్పించారు. కనుక వైసీపి వైపు బీజేపీ మొగ్గు చూపడానికి అనుకూలమైన పరిస్థితి నెలకొని ఉంది. రెండు పార్టీలు బహిరంగంగా పొత్తులు పెట్టుకోనప్పటికీ లోపాయికారిగా అవగాహన కుదుర్చుకొనేందుకు బీజేపీ అధిష్టానం సిద్దంగానే ఉండవచ్చు. కనుక బీజేపీ అధిష్టానం మళ్ళీ మనసు మార్చుకొనేలోగా వైసీపి ముందస్తుకి వెళ్ళేందుకు ప్రయత్నించవచ్చు.
సంక్షేమ పధకాలతోనే మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నట్లు ఎప్పుడో స్పష్టమైంది. అయితే వాటి కోసం చేస్తున్న అప్పులతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దినదినగండంగా మారింది. కనుక మరో 7-8 నెలలు నెట్టుకురావాలంటే చాలా కష్టమవుతుంది. అప్పటికి ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారి సంక్షేమ పధకాలను యధాతధంగా అమలుచేయలేక ఇంకా కోతలు విధించాల్సివస్తే, వేటితో ఆయన వైసీపిని గట్టెకించాలనుకొన్నారో వాటితోనే మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక ముందస్తుకు వెళ్ళక తప్పదు.
ముందస్తు ఎన్నికలకు తగిన రాజకీయ వాతావరణం ఇంతకంటే ఏముంటుంది?బహుశః అందుకే జగన్ త్వరలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు భావించవచ్చు.



