తండ్రికి దండం…బాబాయికి పిండం..!

Idupulapaya

తండ్రి వైస్సార్ రాజకీయ వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని ఆయన సమాధి మీద తన రాజకీయ పార్టీకి పునాదులు ఏర్పాటు చేసుకున్నారు వైస్ జగన్ మోహన్ రెడ్డి. యువజన శ్రామిక రైతు (వైస్సార్) కాంగ్రెస్ పార్టీ పేరుతో శివ కుమార్ స్థాపించిన పార్టీని తానూ హస్తగతం చేసుకుని, తనకు తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను, లీడర్లను కూడా తన సొంత చేసుకుని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఏపీ రాజకీయాలకు పరిచయం చేసారు జగన్.

అయితే ఏపీ రాజకీయాలలో వైస్సార్ పేరును అడ్డుపెట్టుని రాజకీయాలలోకి వచ్చిన జగన్ తన తండ్రి పేరుకున్న విలువను, గౌరవాన్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజార్చారో అర్ధం చేసుకోవాలంటే వైస్సార్ భార్య విజయలక్ష్మి, వైస్సార్ ముద్దుల కూతురు షర్మిల ఉదంతాలే మచ్చుతునకలు.

ADVERTISEMENT

తన రాజకీయ ఆకాంక్షకు అడ్డువస్తుంది అనే ఒకేఒక్క ఆలోచనతో షర్మిలను నువ్వు అసలు వైస్సార్ బిడ్డవేనా.? అంటూ తన సొంత సాక్షి మీడియాలో హేళన చేస్తూ వైస్సార్ కు ఉన్న విలువను దిగజార్చారు జగన్. అలాగే షర్మిలకు అండగా నిలిచింది అనే కారణంగా తల్లి విజయలక్ష్మిని కూడా తన సోషల్ మీడియా మద్దతుదారుల చేత అదే మాదిరి అవమానించి తన తండ్రి ఆత్మకు శాంతి లేకుండా చేసారు.

అలాగే వైస్ రాజశేఖర్ రెడ్డికి అటు రాజకీయంగా ఇటు వ్యక్తిగతంగా వెన్నుదండుగా నిలబడిన ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి పై జగన్ చేసిన రాజకీయానికి సమాజమే తల దించుకుంది. బతికున్నంత కాలం రామలక్ష్మణుల మాదిరి కలిసి తిరిగిన వీరి బంధానికి రాజకీయ పదవులతో వెలకట్టారు జగన్. తన తండ్రి స్థానంలో ఉన్న వివేకా మీద వ్యక్తిగత దాడికి సైతం వెనక్కితగ్గలేదు వైసీపీ.

వివేకా కుమార్తె సునీత మొదలుకుని, ఆమె భర్త, వివేకా భార్య సౌభాగ్యమ్మను కూడా రాజకీయ వేదికల మీదకు తీసుకు వచ్చి మరోసారి తన పదవి కాంక్ష తీర్చుకోవాలని కలలు కన్నారు జగన్. చనిపోయారు, చంపబడ్డారు అనే కనీస మానవత్వం కూడా చూపకుండా ఆయనను ఆయన కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేసారు జగన్. తానూ చేసేదే కాక తన కింద స్థాయి నేతల నోటికి కూడా తాళం తీశారు.

2019 ఎన్నికల ముందు గొడ్డలితో అత్యంత కిరాతకంగా హత్య చేయబడ్డారు వైస్సార్ సోదరుడు వైస్ వివేకా. అయితే తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని పార్టీ పెట్టిన జగన్, బాబాయ్ మృత దేహాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా మరోమెట్టెక్కారు. అయితే నాటి నుంచి నేటి వరకు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డిని చిన్న పిల్లాడిని, అమాయకుడని, సౌమ్యుడని చెప్పుకుంటూ ఆయనను తన పలుకుబడితో కాపు కాస్తూనే ఉన్నారు.

వైస్సార్ మరణం తరువాత ఆయన పేరును అడ్డుపెట్టుకుని విగ్రహ రాజకీయాలకు తెరలేపిన జగన్, వివేకా మరణం తరువాత కుటుంబ రాజకీయాలకు భీజం వేశారు. నేడు వైస్సార్ 75 వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చిన జగన్ పులివెందుల వైస్సార్ ఘాట్ దగ్గర ఆయనకు నివాళి అర్పించారు. పులివెందులలో తన తండ్రి వైస్సార్ కి దండం పెట్టిన చేత్తోనే వివేకా కేసుకు పిండం పెట్టారు.

అయితే ఇప్పుడు వైస్సార్ పేరు మీద నాకు హక్కు ఉందని వైస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున వైస్సార్ జయంతి వేడులను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. విజయవాడలో వైస్సార్ జయంతి వేడుకలను సిద్ధం చేసిన వైస్ షర్మిల ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్య అతిధిగా ఆహ్వానించింది.

వైస్సార్ బ్రాండ్ కోసం కొట్టుకుంటున్న ఈ అన్నాచెల్లి ఇద్దరు తండ్రి వారసత్వ రాజకీయం కోసం ఆరాటపడుతున్నారు కానీ తండ్రికి ఉన్న విలువలను, ఆదర్శాలను పట్టించుకోవడం లేదు. జగన్ కు ఆ అవకాశం వచ్చిన నిలబెట్టుకోలేకపోయారు. షర్మిల నిలబడినా ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయారు. కుటుంబంతో రాజకీయం మొదలుపెట్టిన జగన్ రాజకీయం కోసం కుటుంబాన్నే కాలతన్నుకున్నారు.

అధికారంలో ఉన్న ఐదేళ్లు “హూ కిల్డ్ బాబాయ్” అనే ప్రశ్నకు సమాధానము చెప్పలేకపోయారు జగన్. ఆ ప్రశ్నకు సమాధానము వెతికినప్పుడే జగన్ వైస్సార్ కు అసలైన నివాళి అర్పించినట్టవుతుంది. లేకపోతే తన రాజకీయ అవసరం కోసం తండ్రి వైస్సార్ కి దండం పెట్టి తన రాజకీయ ఎదుగుదలకు బాబాయి వివేకా కు పిండం పెట్టాడు అనే నిందను జగన్ తానూ రాజకీయాలలో కొనసాగినంత కాలం మోయాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories