జగన్ జనరేటర్, జగన్ ఇన్‌వర్టర్ పధకాల కోసం ఏపీలో డిమాండ్

jagan_Power_Cutsకేవలం మూడేళ్ళ జగన్ పాలనలోనే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి తారుమారైంది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నెలకొని ఉండేది. విద్యుత్‌ కోతలు, పవర్ హాలీడేస్ సర్వసాధారణమైన విషయంగా ఉండేది. దాంతో ఎక్కడ చూసిన జనరేటర్లు, ఇన్‌వర్టర్లులు కనిపిస్తుండేవి.

విద్యుత్‌ సమస్యలకు అవే గొప్ప పరిష్కారంగా అందరూ భావిస్తున్న ఆ రోజుల్లో తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టగానే అనేక చర్యలు చేపట్టి విద్యుత్‌ సమస్యలను పరిష్కరించి ప్రజలకు, పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు గొప్ప ఊరట కల్పించారు.

ADVERTISEMENT

ఆ సమయంలో తెలంగాణ కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు విద్యుత్‌ సంక్షోభాన్ని అరికట్టి మిగులు విద్యుత్‌ సాధించడంతో, అప్పటికి ఇంకా విద్యుత్‌ కొరతతో ఇబ్బందిపడుతున్న తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ కేసీఆర్‌ తీసుకొనేందుకు ఇష్టపడలేదు. అది వేరే సంగతి.

కానీ అప్పుడు మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నేడు మళ్ళీ విద్యుత్‌ సంక్షోభంలో చిక్కుకోగా, అప్పుడు విద్యుత్‌ సంక్షోభంతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రం నేటికీ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా కొనసాగుతోంది. అందుకు కారణం ఆ రాష్ట్రంలో ఎంతో దూరదృష్టి కలిగిన కేసీఆరే నేటికీ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటమే అని వేరే చెప్పక్కరలేదు. ఈ మండు వేసవిలో తెలంగాణ ప్రజలు గరిష్టంగా విద్యుత్‌ వినియోగిస్తున్నా కూడా ఇంకా అక్కడ మిగులు విద్యుత్‌ ఉంది.

గత ఏడాది జూన్‌ నాటికి తెలంగాణలో 7,778 మెగావాట్స్ స్థాపిత విద్యుత్‌ సామర్ధ్యం ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అది 17,305 మెగావాట్స్ కు చేరుకొంది. అదేవిదంగా గత ఏడాదిలో 74 మెగావాట్స్ సోలార్ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుండగా ఈ ఏడాదికి అది ఏకంగా 4,431 మెగావాట్స్ కు చేరుకొంది. అంటే విద్యుత్‌ ఉత్పతి గణనీయంగా పెరిగిందన్న మాట!

గత ఏడాది తెలంగాణలో రోజుకి 5,661 మెగావాట్స్ విద్యుత్‌ డిమాండ్ ఉండగా ఈ ఏడాది అది 14,160 మెగావాట్స్ కి చేరుకొంది. ఇదే యూనిట్లలో చెప్పుకొంటే, గత ఏడాది గరిష్టంగా128 మిలియన్ యూనిట్స్ వినియోగించ ఈ ఏడాది 283.83 మిలియన్ యూనిట్లకు చేరుకొంది.

అంటే గత ఏడాదిలో 2,117 మెగావాట్స్ మిగులు విద్యుత్‌ ఉండగా, ఈ ఏడాదిలో 3,145 మెగావాట్స్ మిగులు విద్యుత్‌ తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఈ వేసవిలో అత్యధికంగా విద్యుత్‌ వినియోగిస్తున్నా కూడా ఇంకా మిగులు విద్యుత్‌ ఉంది.

కానీ ఇదివరకు తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయగల స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నేడు అధికార, అనధికార విధ్యుత్ కోతలతో ప్రజలు, పరిశ్రమలు అల్లాడిపోతున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎంతసేపు విద్యుత్‌ సరఫరా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కేవలం మూడేళ్ళలోనే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టించిన ఘనత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే.

అయితే జగన్ ప్రభుత్వం పుణ్యమాని రాష్ట్రంలో ఇన్‌వర్టర్లు, జనరేటర్స్ వ్యాపారం మళ్ళీ పుంజుకొంది. అందుకు వారందరూ సిఎం జగన్మోహన్ రెడ్డికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.

జగన్ ప్రభుత్వం ఇప్పట్లో ఈ విద్యుత్‌ సంక్షోభం ఎలాగూ తీర్చలేదు కనుక విద్యుత్‌ కోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు ‘జగన్ జనరేటర్’ లేదా ‘జగన్ ఇన్‌వర్టర్’ పధకం ప్రారంభిస్తే అందరూ హర్షిస్తారు. పొరుగు రాష్ట్రం కూడా చాలా సంతోషిస్తుంది కదా?

ADVERTISEMENT
Latest Stories