హిందువులు ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టే ముందు విగ్నేశ్వరుడిని పూజిస్తున్నట్లే సిఎం జగన్ కూడా ఎప్పుడు, ఎక్కడ బటన్ నొక్కుతున్నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను తలుచుకొంటారు. అమలాపురం బటన్ నొక్కుడు సభలో కూడా చంద్రబాబు నాయుడుని పదేపదే తలుచుకొని సిఎం చాలా బాధపడ్డారు.
చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని, పేదలకు ఇళ్ళు కట్టించకుండా మోసం చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను, మైనార్టీలను అందరినీ అవమానించారని, పుంగనూరులో ఆయనకు పోలీసులతో భద్రత కల్పిస్తే వారిపైనే దాడులు చేయించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు చూసి చంద్రబాబు, పవన్‌ల ఫ్యూజులు ఎగిరిపోయాయని ఎద్దేవా చేశారు.
అయితే బటన్ నొక్కి డబ్బులు ఇస్తామని చెప్పి బలవంతంగా జనాలను తీసుకువచ్చి కూర్చోబెట్టినప్పుడు, జగన్ సొంత భజన చేసుకోకుండా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల భజన చేయడం దేనికి?వేరే భాషలో సూపర్ హిట్ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతే ఫ్లాప్ అయిన్నట్లుంది ఇది. జగన్ ప్రత్యర్ధుల స్టోరీ చెప్పుకొనే బదులు సొంత స్టోరీయే చెప్పుకోవచ్చు కదా?
నాలుగున్నరేళ్ళ తర్వాత కూడా ఇంకా చంద్రబాబు పాలనతోనే బేరీజు వేసుకొంటున్నారంటే అర్దం జగన్ ఇంకా రాష్ట్రం మీద తన ‘ముద్ర’ వేయలేకపోయానని స్వయంగా అంగీకరిస్తున్నట్లుంది.
అయినా బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు, చంద్రబాబు, పవన్‌ల నుంచి ‘మీ బిడ్డను మీరే కాపాడాలంటూ’ ప్రజలను వేడుకోవడం దేనికి?అంటే సంక్షేమ పధకాలతో ఓట్లు రాలవని అనుమానపడుతున్నారా? లేక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఈసారి తనను గద్దె దించేస్తారని భయపడుతున్నారా?మేకపోతు గాంభీర్యం అంటే ఇదేనేమో?



