ప్రతీసారి ఒక దెబ్బకు రెండు పిట్టలంటే ఎలా?

ys-jagan-ap-assembly-2024

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేసినా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ప్రయత్నించేవారు. కానీ ఆ ప్రయత్నంలో రెండు పిట్టలు ఎగిరిపోతుండేవి.

ఉదాహరణకు అధికారంలోకి రాగానే సంక్షేమ పధకాలతో ప్రజలకు మేలు చేయడం మొదలుపెట్టారు. వాటితో ఎన్నికలలో ఓట్లు రాలుతాయనుకున్నారు. కానీ రాలలేదు.

ADVERTISEMENT

అమరావతిపై కమ్మ ముద్రవేసి పక్కనపెట్టేసి మూడు రాజధానులన్నారు. మూడు ప్రాంతాలలో ప్రాంతీయ విద్వేషాలు రగిలించి టిడిపి నేతలకు ఎక్కడా చోటులేకుండా చేయాలనుకున్నారు. కానీ ప్రజలు ఆ ప్రతిపాదనని పట్టించుకోకపోవడంతో ఆ ఐడియా బెడిసికొట్టింది.

తర్వాత జగన్‌ విశాఖలో కాపురం చేయడమే ‘విశాఖ రాజధాని’ అంటూ కొత్త సూత్రం కనిపెట్టి, ఋషికొండపై కాపురం పెట్టాలనుకున్నారు. దాంతో ఉత్తరాంధ్రా జిల్లాలలో ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపికి రాలిపోతాయనుకున్నారు. కానీ కాపురం పెట్టలేదు… ఓట్లు రాలలేదు!

ఇలా ఒకటా రెండా… వందల కొద్దీ ఉదాహరణలు చెప్పుకోవచ్చు. పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతోనే పోతాయన్నట్లు, ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయినా తర్వాత కూడా ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనే అలవాటు పోవడంలేదు.

వినుకొండలో శవరాజకీయాలు, పొలిటికల్ డ్రామా ముగియగానే ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు. ధర్నా దేనికంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని లోకానికి చాటింపు వేసేందుకట!

కానీ దానికి మరో కారణం కూడా ఉంది. అదే… శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకోవడం. శాసనసభలో మనకి పెద్దగా పనిలేదని జగన్‌ ముందే చెప్పేశారు. కనుక బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకాకపోవచ్చని అందరూ అనుకుంటున్నదే.

అయితే ఓ మాజీ ముఖ్యమంత్రి కీలకమైన రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకాపోతే టిడిపికి భయపడి పారిపోయారని అందరూ అనేస్తారు. కనుక అదే సమయంలో ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారు. భయం లేకుంటే సమావేశాలకు హాజరయ్యి బడ్జెట్‌ చర్చలలో పాల్గొని సమావేశాలు ముగిసిన తర్వాతే ఢిల్లీలో ధర్నా పెట్టుకోవచ్చు. ఆలస్యం అయితే ఎవరూ ఏమీ అనుకోరు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఢిల్లీకి వస్తారు కనుక అప్పుడు ధర్నా చేస్తే అందరి దృష్టిని ఆకర్షించవచ్చని జగన్‌ ఆలోచన. అంటే శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకుంటూనే, రాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీలో బురద జల్లాలనుకోవడం మళ్ళీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకోవడమే.

జగన్‌, విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్ళినప్పుడు మీడియా పలకరిస్తే పర్వాలేదు కానీ సీబీఐ లేదా ఈడీ వచ్చి పలకరిస్తేనే కాస్త ఇబ్బంది పడాల్సివస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకోవచ్చు కదా?

ADVERTISEMENT
Latest Stories