విలువలు – విశ్వసనీయత ఈ రెండు పదాలు పలకడానికి అందంగా.. ఆచరించడానికి బరువుగా ఉంటాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పదే పదే ఉచ్చరించే ఈ పదాలను ఆచరణలో ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తున్నారో ఒక్కసారి చూద్దాం. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక “వైసీపీ తెలుగు నిఘంటువు”…ఒకటి రాష్ట్రంలో అమలు చేస్తుంది. వారి దృష్టిలో ఆయా చర్యలకు అర్ధాలు ఇవేనేమో మరో!
తండ్రి వైస్సార్ మరణాన్ని అవకాశంగా తీసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని ఆశించిన జగన్ విలువలు ఇక్కడినుండి మొదలుపెట్టాలి. తనతండ్రి అంతిమయాత్ర కూడా పూర్తి కాక ముందే ఆనాటి తన మద్దతు దారులుగా ఉన్న నాయకులతో సంతకాల సేకరణతో మొదలు పెట్టిన విలువలు తన బాబాయ్ హత్య కు కారకులుగా చూపబడే నేతలను రక్షించడం వరకు కొనసాగుతున్నాయి.
చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలు అంటూ నిత్యం విమర్శలు చేసే జగన్ తన తండ్రి కి రాజకీయ జీవితాన్ని ఇచ్చి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, పరోక్షంగా తాను కొన్ని వేల కోట్లు సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి జగన్ పొడిచింది వెన్నుపోటా? లేక గొడ్డలి పోటా? జగన్ దృష్టిలో విశ్వసనీయత అంటే ఇదేనేమో!
వైసీపీ అనే రాజకీయ పార్టీతో ముందుకొచ్చిన జగన్ ఆనాడు అన్ని ప్రతికూల పరిస్థితులనే ఎదుర్కొన్నారు. అవినీతి కేసులలో అరెస్టు అయ్యి కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపిన సందర్భంలో పార్టీని నిలబెట్టి దాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లిన తన సోదరి షర్మిలకు జగన్ చేసింది వెన్నుపోటు కాదా? ఆనాడు పార్టీని నిలబెట్టుకోవడానికి చెల్లిని – తల్లిని రోడ్ల మీదకు పంపి తన భార్యకు వ్యాపారాల లావాదేవీలు అప్పగించిన జగన్ విలువలు చెప్పుకోదగ్గవి. కష్టం ఒకరిది హోదాలు అనుభవిస్తుంది మరొకరు.
అధికారం అందిపుచ్చుకున్న కొన్ని నెలలకే తల్లి విజయలక్ష్మి తో పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి పక్క రాష్ట్రానికి పంపించిన జగన్ విలువలు గొప్పవే మరి. జగన్ తాను ఇప్పుడు అనుభవిస్తున్నఈ ముఖ్యమంత్రి పదవి అందుకోవడంలో షర్మిల పాత్ర ప్రశంసించదగ్గదే. అయితే తెలంగాణాలో పార్టీ స్థాపించిన షర్మిలకు మాత్రం జగన్ అన్నగా కనీస మద్దతుగాని.., మానసిక ధైర్యాన్ని కానీ అందించలేక పోయారు. ఇవేనా జగన్ నీ విలువలు – విశ్వసనీయత అంటూ షర్మిల సానుభూతిపరులు కూడా లోలోపల మదన పడుతున్నారు.
తన బాబాయ్ వివేకా మరణానికి కారణాలను మార్చి సాక్ష్యాలను చెరిపి దోషులకు కాపు కాస్తున్న జగన్ విలువలు ఆచరించ దగినవేనా? తన సోదరి అయిన సునీత కుటుంబాన్ని వైసీపీ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయించడమే జగన్ విశ్వసనీయతేమో! కుటుంబంలోనే జగన్ ఇన్ని విలువలు పాటిస్తూ తన సోదరీమణుల పట్ల చూపించే విశ్వసనీయత చూస్తుంటే ఇక ఆంధ్రరాష్ట్రానికి దేశంలో ఏపాటి విలువను తీసుకువస్తారో ఊహించవచ్చు.
విభజనతో అన్యాయానికి గురైన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులను పైడ్ ఆర్టిస్టు అంటూ అవహేళన చేయడమే విలువలా? వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి తనకు అండా దండాగా నిలబడినా కోటం రెడ్డి శ్రీధర్, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలను కాదని వైస్సార్ చావుకి ఒక రకంగా జగనే కారణం అంటూ తనను తన తల్లిని ఆనాటి అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేసిన బొత్స లాంటి నేతలకు పదవులు కట్టబెట్టడమే జగన్ విశ్వసనీయతకు సాక్ష్యాలుగా నిలిచాయి.
రాష్ట్రంలో ఒక సామజిక వర్గం పై కక్ష్య సాధింపుకు రాష్ట్ర భవిష్యత్ ను కూడా పణంగా పెట్టడమే విలువలా? ప్రతిపక్షంలో ఉండగా ఆనాటి టీడీపీ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికి అధికారం లోకి రాగానే రాష్ట్ర రాజధానిని స్మశానాలతో పోల్చడమే విశ్వసనీయతకు రుజువులా? రాజకీయాలతో సంబంధంలేని ప్రతిపక్ష నేతల ఇంటి ఆడవాళ్లను రోడ్ల మీదకు లాగడమేనా మీ విలువులు? రాజకీయాలలోకి బూతుల సంస్కృతిని తీసుకువచ్చి ఆమాటలు మాట్లాడే నేతలకు పదవులను కట్టబెట్టడమే మీ విశ్వసనీయతా?
నాడు – నేడు అంటూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ఏ మేరకు జరిగిందో తెలియదు కానీ రాష్ట్ర ప్రజలకు బూతులు అలవాటు చేయడంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఉత్తీర్ణత పొందిందనే చెప్పాలి. రాజకీయాలలోకి బూతుల సంస్కృతిని తీసుకురావడమే వైసీపీ పార్టీ తాలుక విలువలు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ‘నవరత్నాలను’ మాత్రమే ప్రచారంలో ఉంచుతూ తన పార్టీలో ఉన్న గంట – అరగంట మంత్రులను, అసభ్యకర వీడియోలతో ప్రజలముందు దోషిగా నిలబడిన గోరంట్లలాంటి ‘జాతిరత్నాలను’ వెనకేసుకు రావడం జగన్ విలువలకు ఉదాహరణలు.
తన ప్రభుత్వ డొల్ల తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం,ప్రజల దృష్టిని ఏమార్చడం కోసం, ప్రత్యర్థులను మానసికకంగా కుంగతీయడమం కోసం జగన్ ఏస్థాయికైనా దిగజారగలరు అనేది ఆధారాలు చూపని బాబు అరెస్టుతో రుజువైంది.కేవలం తన పంతం నెగ్గించుకోవడానికి నిబంధనలు పాటించకుండా, చట్టాల నియమాలను అతిక్రమించి జగన్ ఆడుతున్న ఈరాజకీయ చదరంగంలో “విలువలు – విశ్వసనీయత” అనే పదాలు తన రూపాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తున్నాయి. అయితే ఇవి రాష్ట్రాన్ని ఏ గమ్యానికి చేరుస్తాయనేది కాలమే బదులివ్వాలి.