వివేకా హత్య కేసు మిస్టరీకి సంబంధించిన విషయాలు రోజు రోజుకూ సంచలనం రేపుతున్నాయి. వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ ముందు వెల్లడించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అనేక అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఆమె భర్త, వివేకానందరెడ్డి అల్లుడు రాజేశేఖర్ రెడ్డి చెప్పిన విషయం సంచలనం రేపుతోంది. వాస్తవానికి వివేకానంద రెడ్డి చనిపోయాక జగన్ కంటే ముందే అక్కడకు సునీత, రాజశేఖర్ రెడ్డి చేరుకున్నారు.
అయితే వివేకానంద రెడ్డి రూమ్ లో ఓ లెటర్ దొరికిందని, అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉన్నట్టు గానీ రాజశేఖర్ రెడ్డితో పాటు, అక్కడకు వచ్చిన పోలీసులకు మాత్రమే తెలుసని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ విషయం జగన్ తో తాము చెప్పలేదని, కానీ తమకు షాక్ ఇస్తూ.. జగన్ మీడియా సమావేశంలో ఆ లెటర్ విషయాన్ని ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగించిందంటూ రాజశేఖర్ రెడ్డి వివరించారు.
మీడియా సమావేశంలో జగన్ ఆ లెటర్‌తో పాటు, ఇతర విషయాలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడారని వెల్లడించారు. ఇక్కడే అనేక అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. అసలు ఆ లెటర్ గురించి జగన్‌కు వీళ్లు చెప్పకుండానే.. ఆ విషయం జగన్‌కు ఎలా తెలిసింది. అంటే అదంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక డాక్టర్ సునీత కూడా సీబీఐతో విచారణ జరిపించాలంటూ జగన్‌ను అడిగినప్పుడు.. జగన్ వద్దన్నరాని ఆమె తెలిపింది. ఒకవేళ బలవంతంగా చేయిస్తే.. అది తన మీద 12వ సీబీఐ కేసు అవుతుందని, అంతకు మించి ఇంకేం కాదన్నట్టు ఆయన మాట్లాడారని ఆమె స్పష్టం చేసింది. అంటే ఇప్పటికే జగన్ మీద 11 కేసులు ఉన్నాయి. మరి వివేకా కేసులో కూడా తన పేరు వస్తుందని జగన్ ముందే ఊహించి ఆ మాట అన్నారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
అవినాశ్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డిలు జగన్ తనకు కళ్ల లాంటి వారని చెప్పారంటూ సునీత వెల్లడించారు. వీరంతా వివేకా కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న వారే. అంటే జగన్ తీరును చూస్తుంటే.. దీని వెనకాల పెద్ద కథే నడిచందనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి సీబీఐ విచారణలో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.



