అన్న తేలేని ప్రత్యేక హోదా… చెల్లి తెస్తుందట! ఎలా?

YS-Sharmila-Special-Status

ఏపీకి ప్రత్యేక హోదా … ఓ పాచిపోయిన లడ్డూ అని ఎప్పుడో తేలిపోయింది. ఏపీలో రాజకీయ పార్టీలు దానిని వాడుకుని మైలేజ్ పొందగలిగాయే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో నాటకీయంగా ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల కూడా ఈ ప్రత్యేక హోదాని వాడుకుని, రాజకీయ మైలేజ్ తీసుకుందామని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

సొంత అన్నను చెల్లి విమర్శిస్తుంటే ఎవరికైనా చాలా ఆసక్తి కలుగుతుంది. కనుక ప్రత్యేక హోదాతో సహా ఇతర అంశాలపై జగన్మోహన్‌ రెడ్డిని తీవ్రంగా విమర్శించడం ద్వారా ఏపీ ప్రజలను ఆకట్టుకొని, వారి నమ్మకాన్ని పొందవచ్చనే మంచి ఎత్తుగడతో వైఎస్ షర్మిల ప్రజల మద్యకు వచ్చారని చెప్పవచ్చు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి ఇద్దరూ సాధించలేకపోయిన ‘ప్రత్యేక హోదా’ని కేంద్రంలో అధికారంలో లేకుండా, రాష్ట్రంలో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏవిదంగా సాధిస్తారు?అంటే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, రాహుల్ గాంధీ ప్రధాని అయితే వస్తుందని వైఎస్ షర్మిల నమ్మబలుకుతున్నారు.

అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏవిదంగా ఉందో అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ సొంతంగా పోటీ చేసి ఎన్నికలలో గెలవలేదు కనుకనే ఇండియా కూటమిలో చేరింది. అయితే కప్పల తక్కెడ వంటి ఆ కూటమి, సర్వాధికారాలు చేతిలో ఉన్న మోడీ, అమిత్ షాల వంటి బలమైన నాయకత్వం గల బీజేపీని ఎదుర్కొని ఓడించే పరిస్థితిలో లేదని అందరికీ తెలుసు.

ఒకవేళ ఇండియా కూటమి గెలిచి అధికారంలోకి వచ్చినా రాహుల్ గాంధీ ప్రధాని కుర్చీలో కూర్చోంటానంటే నితీశ్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారు ఒప్పుకోరు.

ఒకవేళ ఒప్పుకున్నా రాహుల్ గాంధీ ఏపీలో ప్రత్యేక హోదా ఇస్తే కూటమిలో భాగస్వామిగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ వంటివారుతమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒత్తిడి చేయడం ఖాయం. సరిగ్గా ఈ కారణం చేతనే మోడీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే విషయం అందరికీ తెలిసిందే.

ఒకవేళ వైఎస్ షర్మిల ఏపీకి ప్రత్యేక హోదా సాధించగలనని అనుకుంటే, ముఖ్యమంత్రులుగా పనిచేసి కేంద్రంతో బలమైన సంబంధాలు కలిగిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి ఇద్దరూ తమకు, తమ పార్టీలకు మంచి పేరు తెచ్చిపెట్టే ఈ అవకాశాన్ని వదులుకోరు కదా?

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేలిపోయిన తర్వాత కూడా వైఎస్ షర్మిల మళ్ళీ అదే పాట ఎందుకు పాడుతున్నారంటే, ఆ పేరుతో ఆంధ్రా ప్రజలను మరోసారి మభ్యపెట్టి ఏపీ కాంగ్రెస్‌ని బ్రతికించాలనే!

ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి వాళ్ళను ఉద్దరిస్తానంటూ ఇంతకాలం అక్కడ తిరిగారు. కానీ తననే నమ్ముకున్న సొంత పార్టీ నేతలను కూడా అన్నలాగే రోడ్డున పడేసి ఏపీకి వచ్చేశారు. ఇప్పుడు అన్నలాగే ఏపీ ప్రజలను ఉద్దరించడానికే వచ్చానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు.

రాష్ట్ర విభజన దెబ్బకు పదేళ్లుగా రాజకీయ నిరుద్యోగులుగా మారిన ఏపీ కాంగ్రెస్‌ నేతలు చీమల పుట్టలో నుంచి చీమలు బిలబిలా బయటకు వచ్చిన్నట్లు బయటకు వచ్చి ఇప్పుడు ఆమె వెనుక తిరుగుతూ చేస్తున్న హడావుడిని అందరూ చూస్తూనే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ఎటువంటి ప్రేమ, నిబద్దత, అసలు విశ్వసనీయత కూడా లేని ఇటువంటి రాజకీయ నాయకులను నమ్మితే ఆంధ్రప్రదేశ్‌ మరోసారి నష్టపోక తప్పదు. కనుక అందరూ కలిసి ఏపీని కుక్కలు చించిన విస్తరిలా చేయకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే!

ADVERTISEMENT
Latest Stories