కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల… ఎన్ని లెక్కలో!

YS-Sharmila-Meets-DK-Shivakumarవైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయమైపోయింది. త్వరలోనే ఆమె ఢిల్లీలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్నారు. అయితే ఆమెను కాంగ్రెస్‌లో చేర్చుకొనేందుకు ఆ పార్టీ నేతలు కట్టుకొంటున్న లెక్కలు చూస్తే ఆవురా! అని అనుకోకుండా ఉండలేము.

ADVERTISEMENT

ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొంటున్నారు. అయితే ఆంధ్రా మూలాలున్న ఆమెను తెలంగాణ కాంగ్రెస్‌లో చేర్చుకొంటే, బిఆర్ఎస్ పార్టీ ఆమెను బూచిగా చూపించి ఆంద్రావాళ్ళు కాంగ్రెస్‌ ముసుగులో వచ్చి రాష్ట్రాన్ని దోచుకోవడానికి వస్తున్నారంటూ కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే నష్టపోతామని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తదితరులు వాదిస్తున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్‌ బలం పుంజుకొంది కనుక ఎట్టి పరిస్థితులలో ఆమెను తెలంగాణ కాంగ్రెస్‌లో వద్దని వాదిస్తున్నారు.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పెట్టి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు కనుక వైసీపీని దెబ్బతీయాలంటే ఆమెకంటే సరైనవ్యక్తి మరొకరు ఉండరని ఏపీ కాంగ్రెస్‌లో కొందరు సీనియర్స్ వాదిస్తున్నారు. ఆస్తులు, పదవులు పంపకాల విషయంలో ఆమెను కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు కనుక ఆమెనే జగన్‌పై ఆయుధంగా ప్రయోగిస్తే ఆమె సర్వశక్తులు ఒడ్డి అన్నతో పోరాడుతారనే వాదిస్తున్నారు. ఆమె వస్తే రాష్ట్ర విభజన తర్వాత చెల్లాచెదురైపోయిన కాంగ్రెస్‌ నేతలందరూ తిరిగివస్తారని, వైసీపీకి వెళ్ళిపోయిన కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్ కూడా తిరిగి వస్తుందని ఏపీ కాంగ్రెస్‌లో కొందరు సీనియర్స్ వాదిస్తున్నారు.

కానీ తాను తెలంగాణ బిడ్డనని చివరి శ్వాస వరకు అక్కడే ఉంటానంటూ ఇంతకాలం అక్కడే తిరిగిన ఆమె ఏపీకి వచ్చినా ప్రజలు నమ్మబోరని మరికొందరు వాదిస్తున్నారు. ఒకవేళ ఆమె ఎఒపీకి వచ్చి ఓట్లు చీల్చి వైసీపీని గెలవకుండా ఆపగలరేమో కానీ ఏపీలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాలేరని వాదిస్తున్నారు. ఆమెను తీసుకువచ్చి వైసీపీని గద్దె దింపి టిడిపిని అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా తోడ్పడటం అవసరమా? అని ఏపీ కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రస్తుతానికి ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని జాతీయకార్యవర్గంలో ఏదో ఓ పదవి కట్టబెట్టి, రెండు తెలుగు రాష్ట్రాలలో ఆమె సేవలు వినియోగించుకోవచ్చునని, ఆ తర్వాత ఆమె పనితీరు బాగుంటే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశః ఇదే ఖాయం కావచ్చు.

ADVERTISEMENT
Latest Stories