పాదయాత్రలో వైఎస్ షర్మిలకు చేదు అనుభవం!

YS Sharmila nirudyoga deekshaతెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నిన్న సూర్యపేట జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది.

గత 114 రోజులుగా ఆమె తన పాదయాత్రలో నిత్యం సిఎం కేసీఆర్‌ని, ఆయన మంత్రులను, ఎమ్మెల్యేలని తీవ్రంగా విమర్శిస్తున్నా టిఆర్ఎస్‌ పట్టించుకోవడం లేదు. కనుక పాదయాత్ర నిరాటంకంగా సాగిపోతోంది. కానీ మంగళవారం ఆమె సూర్యాపేట జిల్లాలో లక్కవరంలో నిరుద్యోగ దీక్ష చేస్తున్నప్పుడు, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో స్థానిక టిఆర్ఎస్‌ కార్యకర్తలు వారిపై దాడి చేశారు.

ADVERTISEMENT

వైఎస్సార్ టిపి అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై దాడి చేయడంతో షర్మిల అనుచరులు కూడా వారిపై ఎదురుదాడి చేశారు. కోదాడ డీఎస్పీ వేంకటేశ్వర రెడ్డి వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేశారు. కానీ తమపై దాడి చేసిన టిఆర్ఎస్‌ కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల జోరుగా వాన కురుస్తున్నప్పటికీ గ్రామంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద కూర్చొని ధర్నా చేశారు. ఆమె ఆ వర్షంలోనే 4 గంటల సేపు తండ్రి విగ్రహం వద్ద కూర్చొని ధర్నా చేశారు. రాత్రి 9 గంటలకు డీఎస్పీ వేంకటేశ్వర రెడ్డి మళ్ళీ వచ్చి ఆమె అనుచరులపై దాడి చేసినవారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో వైఎస్ షర్మిల దీక్ష విరమించారు.

అనంతరం వైఎస్ షర్మిల తన అనుచరులతో మాట్లాడుతూ, “ఎమ్మెల్యే సైదిరెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే తన అనుచరులతో మనపై దాడి చేయించారు. అధికార పార్టీకి చెందినవారు కనుక పోలీసులు కూడా ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆయన అనుచరులను విడిచిపెట్టేశారు. నా పాదయాత్రకు రక్షణ కల్పిస్తామని పోలీసులు చెప్పారు కానీ ఈరోజు వారి సమక్షంలోనే మనపై టిఆర్ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతోందో అర్ధం కావడం లేదు. పోలీసులు టిఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు,” అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT
Latest Stories