ప్రియమైన అన్నయ్యకి చెల్లి షర్మిల వ్రాయునది ఏమనగా…

Jagan Sharmila

రాష్ట్ర విభజన పాపాన్ని ఆంధ్ర ప్రజలు ఈ పదేళ్ళలో మరిచిపోయే ఉంటారని, కనుక పార్టీని మళ్ళీ బ్రతికించుకోవచ్చని కాంగ్రెస్‌ అధిష్టానం భావించి వైఎస్ షర్మిలని ఏపీకి పంపింది. కానీ పదేళ్ళుగా రాష్ట్రంలో కనబడకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ప్రజల మద్యకు వస్తే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా?

ADVERTISEMENT

అందుకే ఆమె ఏపీకి ప్రత్యేక ప్రత్యేక హోదా అంశం గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ మానిన ఆ పాత గాయాలను దాంతోనే మళ్ళీ కెలుతున్నామనే విషయం ఆమె గ్రహించిన్నట్లు లేదు. ఒకవేళ గ్రహించినా చెప్పుకోవడానికి వేరే ఏమీ లేదు కనుక దాంతోనే ముందుకు సాగుతున్నారు.

తాజాగా అన్న జగన్మోహన్‌ రెడ్డికి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఆమె బహిరంగ లేఖలు వ్రాశారు. సారాంశం ఏమిటంటే, ‘విభజన హామీల కోసం కలిసి పోరాడుదాం’ అని!

వారితో ఆమె శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో పోరాడేందుకు సిద్దమవుతూ, తనతో కలిసి ఏపీ కోసం పోరాడుదామని లేఖలు వ్రాయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, రాజకీయ గుర్తింపు కోసం ఆరాటమే. ఏపీలో ఆమె ‘రాజకీయ ర్యాంకింగ్’ పెరగాలంటే నిత్యం ఇటువంటి డ్రామాలు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి.

మరో విషయం, ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నారనేది ముఖ్యం కానేకాదు. వైసీపి, టిడిపి, జనసేనల నుంచి ఎంతమంది వచ్చి చేరారనేదే చాలా ముఖ్యం. అదే ఆమె రాజకీయ శక్తిసామర్ధ్యాలకు, పరపతికి కొలమానంగా పరిగణింపబడుతుంది.

కనుక ఏపీలో ఆమె ‘రాజకీయ ర్యాంకింగ్’ పెరిగితే తప్ప ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కన్నెత్తి చూడరు. కానీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా గంట మోగవచ్చు కనుక ఆమె వద్ద ఎక్కువ సమయం లేదు. కనుక ఈ పేరుతో హడావుడి చేయక తప్పదు. రాబోయే రోజుల్లో ఈ హడావుడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

కానీ కాంగ్రెస్‌ పాపాలను వైఎస్ షర్మిల కడిగేయగలరా?ప్రత్యేక హోదా అసాధ్యమని తెలిసి ఉన్నా ఆ పేరుతో రాజకీయాలు చేస్తున్న ఆమెను ఏపీ ప్రజలు క్షమిస్తారా?రాబోయే ఎన్నికలలో జగన్మోహన్‌ రెడ్డి ఓడిపోతే ఆమె చేస్తారు? గెలిస్తే ఏం చేస్తారు?వేరేగా ఉంటారా?ఇద్దరూ రాజీపడి కొత్త డ్రామా మొదలుపెడతారా?అనే ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పకపోవచ్చు. కానీ కాలం తప్పక చెపుతుంది.

ADVERTISEMENT
Latest Stories