అవును వైఎస్ షర్మిల ప్రస్తుత పరిస్థితి ఇదే! జగనన్నతో విభేదించి తెలంగాణకు పోయి పార్టీ పెట్టుకొని సుమారు రెండేళ్ళపాటు కాళ్ళరిగేలా పాదయాత్ర చేసినప్పటికీ అక్కడి ప్రజలు, పార్టీలు, మీడియా ఎవరూ పట్టించుకోవడం లేదామెను. ఈ పరిస్థితులలో ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ఆఫర్ రావడం అదృష్టమనే అనుకోవచ్చు.
అయితే ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దపడినప్పటికీ, తెలంగాణలో ఆమెకు స్థానం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పేశారు. తాను ఉండగా ఆమెను కాంగ్రెస్‌లో చేరనీయనని తేల్చి చెప్పేశారు. ఆమె ఏపీ కాంగ్రెస్‌లో చేరాలనుకొంటే, ఇక్కడ వైసీపీకి అభ్యంతరం. ఆమె అక్కడ ఉండటమే మేలని భావిస్తోంది. కనుక తెలంగాణ పొమ్మంటది… ఆంద్రా వద్దంటదన్నప్పుడు ఆమె ఏం చేయాలి?
ఈ ప్రశ్నకు జవాబు ఆమె స్వయంగా చెప్పారు. తాను తెలంగాణ బిడ్డనని తెలంగాణ ప్రజల కోసం తుదిశ్వాస వరకు పోరాడుతూనే ఉంటానని తేల్చిచెప్పేశారు. అంటే ఆంధ్రాకు వెళ్ళే ఉద్దేశ్యం లేదని తేల్చిచెప్పేసిన్నట్లే. పైగా గొప్ప దార్శనికుడునని చెప్పుకొనే తెలంగాణ సిఎం కేసీఆర్‌కు పనీపాట లేకనే తన గురించి ఇటువంటి పుకార్లు వ్యాపింపజేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన తన భవిష్యత్ గురించి ఆలోచించే బదులు పాలనపై శ్రద్ద పెట్టాలని వైఎస్ షర్మిల హితవు పలికారు.
ఈ నెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీలు కడపలో ఇడుపులపాయకు వస్తారని, అక్కడే వారి సంక్షంలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె తాను తెలంగాణను వదల బొమ్మాళీ అంటుండటంతో ఆమె ఏమి చేయబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది.
ఒకవేళ ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లోనే చేరాలనుకొంటే ఆ పార్టీలో సీనియర్ నేతలు ఒప్పుకోరు. ఆమెకు తెలంగాణలో బలం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ కోసం చాలా పోటీ ఉంటుంది కనుక ఆమెతో పొత్తులకు కూడా వారు అంగీకరించకపోవచ్చు.
కనుక ఆమె తన పార్టీని యదాతధంగా కొనసాగించడం లేదా కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీకి తరలిరావడం రెండే ఆప్షన్స్ ఆమె ముందున్నాయి. జూలై 3న ఖమ్మంలో జరుగబోయే కాంగ్రెస్ సభకు రాహుల్ గాంధీ రాబోతున్నారు. కనుక ఆలోగా వైఎస్ షర్మిల రాజకీయ కార్యచరణపై స్పష్ఠత రావచ్చు.





