నా వల్ల ఎవరూ ఇబ్బంది పడొద్దు.. వెళ్ళిపోతున్నా!

YSVijayamma-Resignation-YSRCPవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేత రాజీనామా చేయించి పార్టీలో నుంచి బయటకు సాగనంపుతారని నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిని వైసీపీ నేతలు ఖండించినప్పటికీ ఈరోజు వైసీపీ ప్లీనరీ సభలో అదే జరిగింది. పార్టీలో నుంచి తప్పుకొంటున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించారు.

ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ, “ఇక్కడ నా కుమారుడు జగన్, అక్కడ తెలంగాణలో నా కుమార్తె షర్మిల ఇద్దరూ వేర్వేరు మార్గాలలో ప్రయాణిస్తున్నారు. జగన్ స్టాండ్ జగన్‌కుంది. అలాగే షర్మిల కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇద్దరూ నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే! అయితే ఇప్పుడు వైఎస్ షర్మిలకు నా అవసరం ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నాను.

ADVERTISEMENT

నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకూడదని, నా వలన ఎవరికీ ఇబ్బంది కలగకూడదని భావిస్తున్నాను. అందుకే నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొంటున్నాను. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నాను. నేను ఇప్పుడు రాజీనామా చేస్తే నిన్ననే రాజీనామా చేశానంటూ నా సంతకంతో మీడియాలో ఓ లేఖ విడుదలవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నా వలన ఇటువంటి వివాదాలు తలెత్తకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను,” అని వైఎస్ విజయమ్మ చెప్పారు.

అయితే విపక్షాలు, వాటి అనుకూల మీడియా తాను రాజీనామా చేసినట్లు, తనను తన కుమారుడు పార్టీ నుంచి బయటకు పంపించేయబోతున్నట్లు దుష్ప్రచారం చేశాయని విజయమ్మ ఆరోపిస్తున్నప్పటికీ జరిగిన వాస్తవం అదే కదా?

ఆమె రాజీనామా చేస్తున్నారనే విషయం వైసీపీలో నుంచి బయటకు పొక్కితేనే మీడియా, విపక్షాలు ఆ విషయం చెప్పాయి తప్ప వాటంతట అవి ఊహించి చెప్పలేదు కదా? ఒకవేళ అవి అబద్దమని నిరూపించదలచుకొంటే ఈరోజు ప్లీనరీలో వాటిని ఖండించి వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగి ఉండేవారు కదా?

నా ఉనికి ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదని చెప్పిన విజయమ్మ మాటలలోనే తన వలన కొడుకు ఇబ్బంది పడుతున్నాడని చెప్తున్నారు కదా? కానీ ఇంతకాలం ఆమె వలన ఇబ్బంది పడని జగన్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడంటే అర్ధం ఏమిటి?

ఇంతకు ముందు కూతురు షర్మిల అన్నతో విభేదించి వెళ్లిపోగా ఇప్పుడు తల్లి విజయమ్మ కూడా కొడుకుతో విభేదించి వెళ్ళిపోతూ మద్యలో ప్రతిపక్షాలను, మీడియాను ఆడిపోసుకోవడం దేనికి?వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను ఆ పదవిలో నుంచి తొలగిస్తే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతోనే ప్లీనరీకి పిలిచి రాజీనామా చేస్తున్నట్లు ఆమె చేత ప్రకటింపజేసినప్పుడు, మద్యలో ప్రతిపక్షాలు ప్రతిపక్షాలను, మీడియా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించడం దేనికి?

నిజానికి విజయమ్మ వేలెత్తి చూపాల్సింది ఎవరిని? ప్రతిపక్షాలను, మీడియానా? తన కుమారుడినా?

ADVERTISEMENT
Latest Stories