వైఎస్ వివేకానంద రెడ్డి 2019, మార్చి 15న అతి దారుణంగా హత్య చేయబడ్డారు. అంటే నేటికీ దాదాపు నాలుగున్నరేళ్ళు. ఇంతకాలం ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. జూన్ నెలాఖరుకి ఈ కేసు విచారణ ముగించాలని సుప్రీంకోర్టు విధించిన గడువు కూడా దాటిపోయింది. కానీ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అది నేరనిరూపణకు జరుగుతున్నా విచారణ అయితే సంతోషమే కానీ నిందితులు బెయిల్ పిటిషన్లపై విచారణలు జరుగుతున్నాయి! అంటే అసలు విచారణ ఇంకా మొదలవనే లేదన్నమాట!
తెలంగాణ హైకోర్టులో గురువారం వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. వివేకా హత్యలో వారే ప్రధాన నిందితులని, వారే సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని, కేసు విచారణ ముందుకు సాగనీయకుండా సీబీఐని కూడా అడ్డుకొన్నారని సీబీఐ తరపు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలియజేశారు.
ఈ హత్యలో పాలుపంచుకొన్న మరో నిందితుడు డ్రైవర్ దస్తగిరి అప్రూవరుగా మారడాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా సమర్ధించాయని, దస్తగిరి చెప్పిన వివరాలతో సహా పలు సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశామని సీబీఐ న్యాయవాది హైకోర్టుకి తెలిపారు.
నిందితులు ఏపీలో ఓ రాజకీయ పార్టీకి చెందిన చాలా పలుకుబడి కలిగినవారని, వారికి బెయిల్ మంజూరు చేస్తే కేసును తారుమారు చేయగలరని కనుక వారికి బెయిల్ ఇవ్వరాదని వాదించారు.
ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది ఈ కేసులో నిందితుల పాత్ర వివరిస్తూ, వారి మద్య జరిగిన ఆర్ధిక లావాదేవీలు, ఫోన్ కాల్స్, సీబీఐ అధికారులను వారు ఏవిదంగా బెదిరించారో పూసగుచ్చినట్లు వివరించారు.
మరోపక్క ఇదే కేసులో ఏ-5 నిందితుడుగా ఉన్న శివశంకర్ రెడ్డి కూడా సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అటు హైకోర్టు, ఇటు సీబీఐ కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసు విచారణలను వాయిదా వేశాయి.
నాలుగున్నరేళ్ళుగా కేసు విచారణ జరుగుతున్నా నేటికీ నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ దశలోనే ఉండటం గమనిస్తే, నిందితులు మన చట్టాలలో వెసులుబాటుని ఉపయోగించుకొంటూ ఈ కేసు ముందుకు సాగనీయకుండా ఏవిదంగా అడ్డుకొంటున్నారో అర్దమవుతోంది. అంటే నిందితులు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోగల సమర్దులని స్పష్టం అవుతోంది. సీబీఐ కూడా ఇదే చెపుతోంది. కనుక వివేకా హంతకులకు శిక్షలుపడేలా చేయగల శక్తి సీబీఐకి, మన న్యాయవ్యవస్థకు లేదనే భావించాల్సి ఉంటుందేమో?



