వివేకా హత్య కేసులో చాలా మంది పెద్దోళ్ళున్నారు.. నన్ను చంపేస్తారేమో?

ys-vivekananda-reddyవైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడున్నరేళ్ళు గడుస్తుంది. సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది. కానీ ఇంతవరకు వివేకను ఎవరు హత్య చేశారో… ఆయనను ఎవరు, ఎందుకు హత్య చేయించారో కనుగొనలేకపోతోందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే కొంతమంది సాక్షులు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా డ్రైవర్ దస్తగిరి కూడా తన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పాడు.

దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ, “నాకు ప్రాణహాని ఉందని నేను ఓ కుక్కను పెంచుకొంటే, ఇంట్లో నేను లేనిసమయంలో ఎవరో దానిని చంపేశారు. మర్నాడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చనిపోయిన ఆ కుక్కను డబ్బులిచ్చి కొనుక్కోనేందుకు రావడంతో నాకు ఏదో అనుమానం కలిగింది. ఆ తర్వాత ప్రభుత్వం నా ఇద్దరు గన్‌మెన్‌లను మార్చేసి కొత్తవారిని నియమించింది. ఇవన్నీ చూస్తుంటే నన్ను కూడా చంపేసేలా ఉన్నారు.

ADVERTISEMENT

వివేకానందరెడ్డి హత్య కేసులో చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. ప్రభుత్వం కూడా వారి చేతుల్లోనే ఉంది. కనుక ఇప్పుడు నా ప్రాణాలకు చాలా ప్రమాదం ఉందని నేను భావిస్తున్నాను. నాకు ఏది జరిగినా అందుకు సిఎం జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత. జిల్లా ఎస్పీకి అన్నీ చెప్పుకొన్నాను. కానీ అధికారులు, పోలీసులు పైవాళ్ళు ఏమి చెపితే అదే చేస్తారు. వారు చెప్పినట్లే నడుచుకొంటారు. నేను ఇంట్లో ఉన్నా బయట తిరగాలన్నా చాలా భయంగా ఉంది,” అని దస్తగిరి అన్నాడు.

దస్తగిరి భార్య షబానా మీడియాతో మాట్లాడుతూ, “క్షణక్షణం మాకు ఏం జరుగుతుందో అని భయం. ఓ ఆడపిల్లకు న్యాయం జరుగుతుందని నా భర్త అప్రూవర్‌గా మారితే మమ్మల్ని ఇంతగా వేదిస్తారనుకోలేదు. నా భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించినప్పటి నుంచి భయంభయంగా బ్రతుకుతున్నాము. అతనికి ఏదైనా జరిగితే నేను, నా పిల్లలు అన్యాయం అయిపోతాము. కనుక జిల్లా ఎస్పీగారు నా భర్త ప్రాణాలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

ఈ కేసులో సాక్షులు, అప్రూవర్ తదితరుల పరిస్థితి ఈవిదంగా ఉంటే సీబీఐ అయినా ఈ కేసులో దోషులను కనుగొనేది ఎప్పుడు?వారికి శిక్షలు పడేదెప్పుడు?

ADVERTISEMENT
Latest Stories