23 , 21 అంటూ టీడీపీ, జనసేన లను ఎద్దేవా చేసిన వైసీపీకి చివరికి మిగిలింది ఈ 11 యే. గెలిచిన ఈ 11 సీట్లతో గడిచిన 50 రోజులలో వైసీపీ చేసిన రాజకీయం గమనిస్తే వైసీపీ కి కనీసం పాస్ మార్కులైన వస్తాయా అనేది ఒక్కసారి విశ్లేషిద్దాం.
ఊహించని ఓటమితో కంగుతిన్న వైసీపీ కొన్ని రోజులు నైరాశ్యంలోకి వెళ్లినా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోకుండా మళ్ళీ అదే తరహా రాజకీయ పంథాతో ముందుకొచ్చారు. చట్ట వ్యతిరేక చర్యలకు తెగబడిన వారిని మంచి వారు, సౌమ్యులు అంటూ సర్టిఫికెట్ ఇవ్వడం, వ్యక్తిగత ఘర్షణలకు రాజకీయ రంగు పూయడం, అసెంబ్లీలో జరగవలసిన చర్చలు ఢిల్లీ విధులలో జరపడంతో వైసీపీ తన రాజకీయ సిద్ధాంతాన్ని తెలియచేసింది.
ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్ళేదే లేదని తనకు అలవాటైన కోర్టులకు వెళ్లారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా గురించి అడిగింది కానీ ప్రశ్నించింది కానీ లేని జగన్ అధికారానికి దూరమవ్వగానే మళ్ళీ హోదా రాజకీయం మొదలుపెట్టడంతో వైసీపీ రెండు నాలుకల ధోరణి బయటపడింది.
ఐదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ అండ్ కో రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకున్నారో నేటి కూటమి ప్రభుత్వం శ్వేత పత్రాల రూపంలో ప్రజల ముందు ఆవిష్కరిస్తుంది. గత ఐదేళ్ళుగా గుంతలు పడ్డ రోడ్లను కూడా బాగుచేయని జగన్ సర్కార్ వందల కోట్లు వెచ్చించి నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్లు ఒకొక్కటిగా ప్రజల ముందుకు వస్తున్నాయి.
కొన్ని వేలకోట్ల ప్రభుత్వ భూములకు నామమాత్రపు రుసుము చెల్లించి వాటిని తమ పార్టీ కార్యలయాల నిర్మాణానికి వినియోగించుకున్న దృశ్యాలు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. పేదవాడికి సెంటు భూమి ఇచ్చి గొప్పలు చెప్పుకున్న జగన్ తన పార్టీ కార్యలయాలకు మాత్రం కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమికి వైసీపీ రంగులద్దారు. ఇవన్నీ కూడా జగన్ అధికారానికి దూరమైన ఈ 50 రోజులలో బయటపడ్డ వాస్తవాలు.
అధికారంలో ఉన్నప్పుడు చేసిన దోపిడీ ప్రతిపక్షంలోకి వచ్చిన 50 రోజులలోనే బయటపడడంతో వైసీపీ పార్టీ పై తాము పెంచుకున్న నమ్మకం ఎంత ప్రమాదకరమో ప్రజలకు అవగతమయ్యింది. 2019 తరువాత ఏపీ వైపు చూడని పారిశ్రామిక వేత్తలు మెల్లిమెల్లిగా రాష్ట్రం వైపు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. దీన్ని సహించలేని జగన్ ఏపీలో విధ్వంసం జరిగిపోతుందని, అరాచకం రాజ్యమేలుతుందంటూ నానా యాగీ చేస్తున్నారు.
ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష స్థానంలో ఉంటూ తన పార్టీ తరుపున గెలిచిన 11 మందితో అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాల్సిన జగన్ అది చేయను అంటూ తెగేసి చెప్పడంతో ప్రజలలో జగన్ పై నమ్మకం సన్న గిల్లింది. పార్టీ నేతలు కూడా ఒక్కొక్కరుగా జగన్ కు దూరంగా వైసీపీకి రాజీనామా చేస్తూ జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే కిలారి రోశయ్య, మద్దాల గిరి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన వైపు చూస్తున్నారు.
దాదాపు 90 నియోజకవర్గాలలో వైసీపీ పార్టీ నేతలలో శబ్దత నెలకొంది. ఒక్క ఓటమితో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం కుప్పకూలిపోయింది. పార్టీ ముఖ్యనేతలు వారి వారసులుకు గడ్డుకాలం మొదలయ్యింది. దీనితో అటు పార్టీ నేతలతోనూ, ఇటు ప్రజలలోను జగన్ నాయకత్వం పై తీవ్ర విమర్శలు రావడంతో టీం 11 కి పాస్ మార్కులు పడనట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




