అసెంబ్లీ పనికిరాదా… పార్లమెంట్ సరిపోతుందా?

YSRCP leadership skipping Assembly but focusing on Parliament sessions in Andhra Pradesh politics

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ పోషిస్తున్న పాత్ర ఏమిటన్నది కనీసం ఆ పార్టీ నేతలకు సైతం స్పష్టత లేదనే చెప్పాలి. 2024 ఎన్నికలలో వైసీపీ 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేని ఘోర ఓటమిని మూటకట్టుకుంది.

దీనితో ప్రజలివ్వని హోదా ప్రభుత్వం ఎలా ఇస్తుంది అంటూ కూటమి ప్రభుత్వం వైసీపీ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష హోదా ను పక్కన పడేసింది. దీనితో ఏపీలో చట్టబద్ధంగా ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే తమకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా తాము అసెంబ్లీకి వచ్చేది లేదంటూ తెగేసి చెప్పిన వైసీపీ, అందుకు తగ్గట్టే అసెంబ్లీని బహిష్కరిస్తూ వస్తోంది. తమ పార్టీకి బలమున్న శాసన మండలిలో మాత్రం తమ గళం విప్పుతున్నారు వైసీపీ నేతలు.

అలాగే తనకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించకపోవడంతో అసెంబ్లీ లో ప్రజా సమస్యల పై చర్చించేందుకు, ప్రభుత్వ తీరు పై ప్రశ్నించేందుకు అవసరమైన సమయం లభించదని, అందుకు బదులు ప్రెస్ మీట్లు నిర్వహించి ప్రజా సమస్యల పై గళమెత్తుతానంటూ జగన్ ప్రకటించారు. ఇప్పటి వరకు దాన్నే కొనసాగిస్తున్నారు కూడా.

రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీకే వెళ్లాలా.? మీడియా సమావేశాలు సరిపోవా.? అంటూ రాష్ట్ర అసెంబ్లీని బహిష్కరించిన జగన్ పార్లమెంట్ సమావేశాలకు గాను వైసీపీ ఎంపీ లకు రాష్ట్ర హక్కులకై సభలో గొంతెత్తాలి అంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు.

స్థానిక సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ అవసరమా.? ప్రాంతీయ మీడియా సరిపోదా? అన్న జగన్ ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర హక్కుల కోసం పోరాటలంటూ,

మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలో జరిగిన పంట నష్టం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సంక్షేమ హాస్టల్ లో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్న లా అండ్ ఆర్డర్ దుర్వినియోగం వంటి వివిధ అంశాల పై పార్లమెంట్ లో వైసీపీ గొంతు వినిపించాలంటూ జగన్ తన పార్టీ ఎంపీ లకు మార్గదర్శకం చేస్తున్నారు.

నేటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యి, తన ఆదేశాలు అనుసరించాలంటూ జగన్ తన ఎంపీ లను ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక్కడ ప్రాంతీయ మీడియాతో సరిపెట్టిన వైసీపీ అక్కడ కూడా తమకు చట్ట సభల అవసరం లేదని, వాటికి ప్రతిగా జాతీయ మీడియాలో రాష్ట్ర సమస్యలు లేవనెత్తి ఆ మీడియా ద్వారానే కేంద్ర ప్రభుత్వం పై వైసీపీ పోరాటం చేసే సాహసం చెయ్యలేదా అంటూ వైసీపీ ద్వంద్వ విధానాల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక్కడ వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో పాల్గొనడాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు, కేవలం అసెంబ్లీ ని బహిష్కరించే విధానాన్ని వేలెత్తి చూపుతున్నారు. హోదా లేకపోతే రాష్ట్ర సమస్యలు వైసీపీ కి పట్టవా.? ప్రజలు తమకిచ్చిన 40% ఓటు బ్యాంకు కు జగన్ చేస్తున్న న్యాయం ఇదేనా.? తనతో పాటు తన పార్టీ 10 మంది ఎమ్మెల్యే లను కూడా చట్ట సభలలో అడుగు పెట్టకుండా చేయడమేనా వైసీపీ 2.0 విధానం.?

ADVERTISEMENT
Latest Stories