కోనసీమ జిల్లా పేరు మార్పు మంత్రి విశ్వరూప్ ఇంటిని దగ్ధం చేస్తే, జిల్లాలోని రామచద్రాపురం టికెట్ వ్యవహారం వైసీపీలో మంటలు రగిలిస్తోంది. టికెట్ విషయంలో వైసీపీ ఎంపీ పిల్లి శుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణకు మద్య మొదలైన పంచాయితీలో సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా కలుగజేసుకొని బోస్‌కు గట్టిగా అంక్షితలు వేసినప్పటికీ, ఇద్దరూ వెనక్కు తగ్గకుండా ఒకరి మీద మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకొంటున్నారు.
పిల్లి శుభాష్ చంద్రబోస్ జగన్ చేత అక్షింతలు వేయించుకొని తిరిగి వచ్చిన తర్వాత, రామచద్రాపురంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఏ నాయకుడైన రాజకీయంగా ఎదగాలంటే అతని వెనుక పార్టీ క్యాడర్ బలంగా నిలబడాలి. నా వెనుక పార్టీ క్యాడర్ అలా నిలబడింది కనుకే ఇంతకాలం రాజకీయాలలో ఉన్నాను.
నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మంత్రి వేణుగోపాల్ కృష్ణ కోసం పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకంటే వారు నా వెంట ఉన్నారని నాలుగేళ్లుగా వారిపై పోలీసులతో అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారు. నన్ను కలిసిన కార్యకర్తలు తన ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా వీల్లేదని చెపుతున్నారు.
నన్ను, తోట తిమూర్తులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశానికి పిలవకూడదని మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఆదేశించడం మమ్మల్ని అవమానించడమే కదా? జగన్ సురక్ష అధికారిక కార్యక్రమంలో తన అనుచరుడిచేత మున్సిపల్ వైస్ ఛైర్మన్‌పై దాడి చేయించి అవమానించారు.
ఇంతకాలంగా మంత్రి వేణు నన్ను అవమానిస్తున్నా, పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నా చాలా సహనంగా భరించాను. కానీ ఇక నాలో ఓపిక నశించింది. అందుకే తప్పనిసరిగా ఆయనను ఎదిరించి పోరాడవలసి వస్తోంది. ఆయన తీరు సరిగా లేదని, నియోజకవర్గంలో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని, కనుక ఇకపై నేను ఆయనతో కలిసిపనిచేయలేనని సిఎం జగన్‌కు స్పష్టంగా చెప్పేశాను.
పార్టీ క్యాడర్‌ని వద్దనుకొనే నాయకుడిని పార్టీ వీధి గుమ్మంలో నుంచే కాదు దొడ్డి గుమ్మంలో నుంచి కూడా ఎవరూ లోనికి రానీయరనే సంగతి ఆయన గ్రహించిన్నట్లు లేదు. కానీ నేను పార్టీ క్యాడర్ కోసం ఎంత దూరమైనా వెళ్ళేందుకు సిద్దంగా ఉన్నాను. ఒకవేళ మంత్రి వేణుగోపాల్ కృష్ణకే మళ్ళీ టికెట్ ఇస్తే నేను నా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆయనపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తాను. లేదా నా కుమారుడు సూర్యప్రకాశ్ పోటీ చేస్తాడు. ఇది ఖాయం.
జగన్‌తో నాకు ఏ సమస్యా లేదు. మంత్రిట్ వేణుతోనే. కనుక నేను ఆయనతోనే అమీతుమీ తేల్చుకొంటాను. ఒక్కసారి మాట అంటే నేను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు,” అని పిల్లి శుభాష్ చంద్రబోస్ అన్నారు.
మంత్రి వేణు స్పందిస్తూ, “ఆయన వేరెవరి ప్రభావంలో ఈవిదంగా ఉన్నట్లున్నారు. నేను ఎవరినీ అవమానించలేదు. ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎవరినీ దూరం పెట్టలేదు. నాలుగేళ్ళుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? టికెట్ కోసమే కదా? అయితే టికెట్ విషయం జగన్ నిర్ణయిస్తారు కానీ ఇలా ఎవరికివారు తమకే టికెట్ అనేసుకొని యుద్ధం ప్రకటించేస్తే ఎలా? రాబోయే ఎన్నికలలో కూడా నాకే టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కనుక పిల్లి అరుపులకు భయపడేదే లే!” అని ఘాటుగా జవాబిచ్చారు.
ఈ వ్యవహారంలో వెనక్కు తగ్గేదేలే అని ఇద్దరూ తేల్చేశారు కనుక ఇద్దరిలో ఒకరిని వదులుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రామచంద్రాపురం వైసీపీలో ఈ మంటలు జగన్ వెంటనే ఆర్పకపోతే కోనసీమ అంతా వ్యాపించే ప్రమాదం ఉంటుంది.



