ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, పరిశ్రమల ఏర్పాటుకి ప్రధాని మోడీ నిన్న విశాఖలో శ్రీకారం చుట్టారు. పదేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం, ఐదేళ్ళలో జగన్ ప్రభుత్వం ఈ స్థాయిలో పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి పనులు సాధించలేకపోయాయి. కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లోనే ఇన్ని సాధించారు.
వీటిలో ఎన్టీపీసీ, రైల్వేశాఖ, జాతీయ రహదారుల శాఖలకు సంబందించినవే చాలా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ (క్రిస్ సిటీ) కూడా ఉంది. ప్రైవేట్ రంగంలో మిట్టల్ స్టీల్ వంటివి వేలకోట్ల భారీ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటుకి సిద్దం అవుతున్నాయి.
ప్రధాని మోడీ చేతుల మీదుగా వీటన్నిటికీ నిన్న శంకుస్థాపనలు జరిగాయి. ఇవికాక ఇప్పటికే రూ.15,000 కోట్ల వ్యయంతో పూర్తయిన రైల్వే లైన్లు, రోడ్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ నిన్న ప్రారంభోత్సవం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత మేలు జరిగినందున రాష్ట్ర ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. కనుక వాటి గురించి కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే అవకాశం ఏర్పడింది. సంక్రాంతి పండుగ కూడా దగ్గర పడింది.
కానీ ఇటువంటి శుభ తరుణంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందడం, 48 మంది గాయపడటంతో రాష్ట్రానికి జరిగిన ఈ మేలు గురించి సంతోషంగా మాట్లాడుకునే బదులు వైసీపీ శవ రాజకీయాలను ఎదుర్కోవలసి వస్తుండటం చాలా బాధాకరమే. సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే అన్నారు.
ఒక డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ త్రొక్కిసలాట జరిగిన్నట్లు ప్రాధమిక నివేదికలో తేలింది. ఇప్పటికే మంత్రుల బృందం అక్కడకు తిరుపతి చేరుకొని ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి త్రొక్కిసలాటకు కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు కూడా మరికొద్ది సేపటిలో తిరుపతికి బయలుదేరబోతున్నారు.
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ త్రొక్కిసలాటలో కుట్ర ఏమైనా ఉందా?అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




