ఏపీలో విద్యుత్ కోతల గురించి మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడిన మాటలు వింటే రాష్ట్రంలో పరిస్థితి అర్దమవుతుంది. రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఎందుకు రావడం లేదో అర్దమవుతుంది.
శ్రీకాకుళంలో గడప గడపకు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రంలో సరిపడా కరెంట్ లేదు. అందుకే కరెంట్ కోతలు విధిస్తున్నాము. అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదని బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నాము,” అని అన్నారు. ఇలా చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా?
ఆంద్రా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఒకేసారి ఏర్పడ్డాయి. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో అనేక పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు అక్కడకు క్యూ కడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కానీ నాలుగున్నరేళ్ళుగా జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరుతో ఓట్ల కోసం ప్రజలకు డబ్బు పంచడంపైనే శ్రద్ద పెట్టింది తప్ప రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడంపై శ్రద్ద చూపలేదు.
ఆ కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పడం లేదు. ఇదే సిగ్గుచేటు అనుకొంటే బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామంటూ మంత్రి ధర్మాన అదేదో గొప్ప విషయమన్నట్లు చెప్పుకోవడం ఇంకా సిగ్గుచేటు.
రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలకు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నందునే, ఆ భారం కూడా విద్యుత్ చార్జీల బాదుడు రూపంలో ‘లబ్ధిదారులతో సహా’ రాష్ట్రంలో ప్రజలందరినీ బాదేస్తుండటం అందరూ అనుభవపూర్వకంగానే తెలుసుకొంటున్నారు.
విద్యుత్ కోతలు విధిస్తున్నా, ప్రజల ముక్కు పిండి అధనంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నా ప్రజలు మళ్ళీ వైసీపికే ఓట్లు వేయాలని అడగడానికి మంత్రి ధర్మానకు ఎలా నోరు వచ్చిందో?