ఎన్నికలప్పుడు రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలు అమలు చేయడం సహజం. ఎందుకంటే లక్షలో, కోట్లో ఖర్చు పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు గెలవడం చాలా ముఖ్యం కనుక!
కానీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా నేటికీ అటువంటి దుష్ప్రచారాలతోనే కాలక్షేపం చేస్తోంది. ముఖ్యంగా ఫేక్ వీడియోలు సృష్టించి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైసీపీకి ఓ దురలవాటుగా మారిపోయింది. టీడీపి, కూటమి ప్రభుత్వం వాటిని బట్టబయలు చేసి ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా ఆ దురలవాటు మానుకోలేకపోతోంది.
తాజాగా హంద్రీ నీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం వరకు కాలువలలో నీళ్ళు పారుతుంటే, సిఎం చంద్రబాబు నాయుడు గంగపూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు నిలిచిపోయాయంటూ వైసీపీ ఓ ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దానిని టీడీపి ఖండిస్తూ, నిండుగా నీళ్ళు పారుతున్న ఆ కాలువ పక్కన నిలబడి ఓ స్థానిక యువకుడు చేసిన వీడియోని పోస్ట్ చేసింది. ఇది చెంపదెబ్బ వంటిదే కదా?
వైసీపీ ఈవిదంగా చేస్తూ కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగేలా చేయాలనుకుంటోందని అర్ధమవుతూనే ఉంది.
కానీ ఈ వయసులో, ఈ హోదాలో కూడా చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల మద్య తిరుగుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ స్వయంగా పించన్లు, సంక్షేమ పధకాల సొమ్ము అందిస్తుంటే, ఇటువంటి ఫేక్ వీడియోలతో ఆయన పట్ల ప్రజలలో వ్యతిరేకత సృష్టించడం సాధ్యమేనా? కానప్పుడు ఎందుకీ శ్రమ? ఎందుకీ చవుకబారు పనులు? అని జగన్ ఆలోచించి ఉండి ఉంటే నేడు ఆయన కూడా ప్రజల మద్య ఉండేవారు.
ప్రధాన ప్రతిపక్షపార్టీ హోదా కోసం పట్టుబడుతున్న జగన్ ప్రతిపక్షపార్టీ నాయకుడుగా కనీస బాధ్యత నిర్వర్తించకుండా ఈవిదంగా బురద జల్లుతూ ఇదే రాజకీయం, ఇవే వ్యూహాలు అన్నట్లు తాడేపల్లి ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తున్నారు.
జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ఇటువంటి కపట రాజకీయాలు చేస్తూ తప్పక మళ్ళీ అధికారంలోకి రాగలనని తాను భ్రమ పడుతూ, పార్టీ శ్రేణులను, ప్రజలను కూడా భ్రమింపజేస్తున్నారు. తద్వారా కూర్చున్న కొమ్మని మళ్ళీ నరుకుంటున్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని నమ్మేవాడికి ఎవరు మాత్రం ఏం చెప్పగలరు?




