కాలుకి దెబ్బ తగిలితే చేతికి కట్టుకట్టినట్లు ఉంటుంది వైసీపీ ధోరణి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పెరిగినట్లు వైసీపీ వితందవాదన చేస్తోంది. ఇందుకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన ర్యాలీలు నిర్వహించబోతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అమెరికా-ఇరాన్ యుద్ధం కారణమని అందరికీ తెలుసు. కానీ కూటమి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని వైసీపీ మేధావి సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చి చెప్పేశారు.
దేశంలో మరే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత ఎక్కువ లేవని ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ప్రజలను నిలువు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం దోపిడీకి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించాలని ఆయన వైసీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సహా పలు బిజేపి, ఎన్డీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకి ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కానీ వైసీపీ అంత ధైర్యం చేయలేదు. కారణాలు అందరికీ తెలుసు.
కానీ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు కనుక వారి ఆగ్రహాన్ని సిఎం చంద్రబాబు నాయుడుపైకి మళ్ళించేందుకు ఈ ఆందోళనలకు సిద్ధం అవుతోంది. కేంద్రాన్ని విమర్శించే ధైర్యం లేదు సరే! కనీసం ఈ కారణంతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే ప్రజలు నవ్వుతారనే ఇంగితం కూడా లేకపోతే ఎలా?
అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఈవిధంగా తప్పుడు సలహాలు ఇస్తున్నారా?లేదా సిఎం చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో ఆయనే ఈవిధంగా పార్టీని నడిపిస్తున్నారా? వైసీపీ ఎప్పుడూ రాంగ్ డైరెక్షన్‌లోనే దూసుకుపోతుంటుంది ఎందుకో?




