అవును.. వైసీపీ నేతలు ఎంత అవినీతికి పాల్పడుతున్నా వారిని ఎవరూ ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే వారిని ఇంట్లోనే బందించి తాళం వేసేస్తారు. అవును నిజమే! ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని అల్లూరుకి చెందిన కవిత అనే మహిళకు ఇదే చేదు అనుభవం ఎదురైంది.
ఆమె చేసిన పాపం ఏమిటంటే గత రెండేళ్లుగా ధాన్యం కొనుగోళ్ళలో జరుగుతున్న అవినీతి గురించి వ్యవసాయాధికారులకు చెప్పారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో ఇటీవల గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వచ్చినప్పుడు, ఆమె ఇదే విషయం గురించి ఆయనకు ఫిర్యాదు చేయబోయారు. కానీ ఓ సాధారణ మహిళ మంత్రినైన తనను ప్రశ్నించడాన్ని సహించలేకపోయిన, మంత్రి బాలినేని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్ళిపోయారు.
బాలినేనితో ఉన్న వైసీపీ నేతలు కూడా ఆమెను తీవ్రంగా బెదిరించి, ఆమెను ఇంట్లోకి వెళ్ళిపొమ్మని హెచ్చరించరు. ఆమె భయంతో ఇంట్లోకి వెళ్ళగానే వైసీపీ నేతలు ఆమె ఇంటికి బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోయారు. వారం రోజులుగా ఆమెను ఇంట్లోనే బందీగా ఉంచడంతో ఆమె నరకం అనుభవించింది. రోజూ కిటికీలో నుంచి దారినపోయే వారిని వేడుకొంటున్నా, వారు కూడా వైసీపీ నేతలకు భయపడి ఆమెకు సాయం చేసేందుకు భయపడ్డారు. చివరికి ఈ విషయం టిడిపి, జనసేనల దృష్టికి రావడంతో రెండు పార్టీలు తమ మహిళా నేతలను అల్లూరికి పంపించగా వారు ఆమె ఇంటి తాళాలు పగులగొట్టి ఆమెకు విముక్తి కల్పించారు.
టిడిపికి చెందిన రావుల పద్మజా, కామరాజు గడ్డ కుసుమకుమారి, ఆర్ల వెంకట రత్నం, షేక్ అజీమూన్నీసా, బీరం అరుణారెడ్డి తదితరులు ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఒక మహిళను ఇంతగా వేధిస్తున్నందుకు వారు స్థానిక వైసీపీ నేతలపి, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాల గురించి నిలదీస్తే జవాబు చెప్పాలి కానీ ఈవిదంగా ఇంట్లో పెట్టి తాళం వేయడం ఏమిటని తెలుగు మహిళలు నిలదీశారు. వైసీపీ నేతలు మహిళలపట్ల ఇంతే నీచంగా వ్యవహరిస్తుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి, పోలీసు యంత్రాంగం అంతా ఏమి చేస్తోందని వారు ప్రశ్నించారు. దీనిపై జాతీయ మహిళా కమీషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు.



