ఏపీలో అభివృద్ధి ఊసే లేనప్పటికీ రాజకీయాలు మాత్రం చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ బటన్ నొక్కుడు సంక్షేమ పధకాలు పంచుడుతో బిజీగా ఉంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు కుల రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.
రాష్ట్రంలో టిడిపి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాగా, మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేన దాని అధినేత పవన్ కళ్యాణ్ వెంటపడుతున్నారు. గత ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ కాపు అస్త్రాన్ని వాడుకోలేదు. కానీ ఈసారి తప్పనిసరిగా తన సామాజికవర్గం ప్రజల మద్దతు పొందాలని భావిస్తున్నారు. అదే వైసీపీని చాలా కలవరపరుస్తోందిప్పుడు.
వైసీపీలో కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు రాజకీయంగా, ఆర్ధికంగా, వారి వర్గంలో కూడా చాలా బలంగా ఉన్నప్పటికీ వారి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన కాపు సామాజిక వర్గానికి చెందినవారు మళ్ళీ వైసీపీకి ఓటేసేందుకు జంకుతున్నారు.
వైసీపీలో కాపు నేతలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ చాలా నిజాయతీగా మాట్లాడుతుంటారు. నిజాయతీగా వ్యవహరిస్తుంటారు. దేశం రాష్ట్రం పట్ల ఆయన మాటలలో తపన, భక్తి కనిపిస్తుంటుంది. కనుక గత ఎన్నికలలో జగన్‌కు ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చిన్నట్లే ఈసారి రాష్ట్రంలోని కాపులందరూ పవన్ కళ్యాణ్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే అని వైసీపీలో కాపు నేతలు భయపడుతున్నట్లు భావించవచ్చు.
పైగా ఆయన టిడిపితో పొత్తులు పెట్టుకొనే ఆలోచనలో ఉన్నట్లు చాలా స్పష్టమైన సంకేతాలే ఇస్తున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలకుండా వారి కూటమికే పడతాయి. ఇదే వైసీపీలో అందరికీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి తన స్థాయిలో చంద్రబాబు నాయుడు, టిడిపి ముఖ్యనేతలను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు.
ఏతావాతా తేలిందేమిటంటే వైసీపీలో అందరూ రాజకీయాలు మాత్రమే చేస్తుంటారని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వారి నుంచి కోరుకొన్నది ఖచ్చితంగా ఇది మాత్రం కాదు. అయినా వైసీపీలో ఎవరూ ప్రజాభిప్రాయాన్ని, ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ రాజకీయంగా దెబ్బతీయగలిగితే ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు కనుక గత్యంతరం లేక మళ్ళీ తమనే ఎన్నుకొంటారనే ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నారు.
వైసీపీలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ సోమవారం అత్యవసరంగా విజయవాడలో సమావేశమవడమే ఇందుకు తాజా ఉదాహరణ. ఆ సమావేశంలో వారు పవన్ కళ్యాణ్‌ని ఏవిదంగా నిలువరించాలి? రాష్ట్రంలో కాపులు ఆయన వెనక వెళ్ళకుండా ఏవిదంగా అడ్డుకోవాలి?అనే దానిపైనే సుదీర్గంగా చర్చించి జనసేనకు కాపులు ఓట్లేస్తే, వాటితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు కానీ పవన్ కళ్యాణ్ కారు కదా?అనే కొత్త లాజిక్ ఒకటి కనిపెట్టారు.
టిడిపి లేదా బిజెపితో పొత్తులు పెట్టుకొన్నప్పుడు ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగితే ఆ పార్టీకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే చిన్న విషయం వైసీపీ నేతలకు తెలియదనుకోలేము. కానీ తెలియనట్లు నటిస్తూ పవన్ కళ్యాణ్‌కి దమ్ముంటే 175 స్థానాలలో పోటీ చేయాలని వైసీపీ నేతలు రెచ్చగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విదంగానైనా పవన్ కళ్యాణ్ టిడిపితో చేతులు కలపకుండా చేసి వేర్వేరుగా పోటీ చేసేలా చేయగలిగితే చాలు… గత ఎన్నికలలో లాగే మళ్ళీ రెండు పార్టీలు ఓడిపోతాయని, వైసీపీ గెలిచేస్తుందని ఆశపడుతున్నారు. కానీ అన్నీ వారు కోరుకొన్నట్లే జరగవు. జరిగేమాటయితే టిడిపి, జనసేన పార్టీలను ఎన్నికలలో పోటీ చేయకుండా ఎప్పుడో నిషేధించేసి ఉండేవారు కదా?



